గుట్టలుగా పేరుకుంటున్న ప్లాస్టిక్ ప్రపంచాన్ని ముంచెత్తుతోంది. పర్యావరణానికి తీరని హాని చేస్తోంది. దీనికి ఎలాంటి పరిష్కారం లేదా? ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా వినియోగించే మార్గమే లేదా..? సాధ్యమే అంటున్నాడో యువ పారిశ్రామికవేత్త. ఏకంగా ప్లాస్టిక్ తో ఓ ఇల్లు కట్టి చూపించాడు. 

ప్రపంచంలో ఏటా కోట్ల టన్నుల ప్లాస్టిక్ పోగుపడుతోంది. భూమిపొరల్లో, సముద్రపు అంతర్భాగంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. మట్టిలో కలిసిపోవటానికి వేల సంవత్సరాల కాలం తీసుకునే ప్లాస్టిక్ పర్యావరణానికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. భూమ్మీద  పేరుకుంటున్న ప్లాస్టిక్ ని ఎలా అదుపు చేయాలి? ఎలా రీసైకిల్ చేయాలనే ప్రశ్న ఓ పారిశ్రామికవేత్తకు వచ్చింది. దాని ఫలితంగానే రెండేళ్లలో ప్లాస్టిక్ తో ఇంటిని రూపొందించాడు. అందంగా తీర్చినట్టు కనిపిస్తున్న ఈ ఇంటి నిర్మాణంలో కాంక్రీట్ ఏమాత్రం వాడలేదు. 

ప్రశాంత్‌ లింగం, అరుణ...ప్రత్యామ్నాయ గృహ నిర్మాణ పద్దతులపై ఇప్పటికే చాలా పరిశోధనలు చేసిన ఈ జంట వెదురుతో గృహనిర్మాణంలో కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఇల్లు కట్టి చూపించింది. వాడేసిన పాలపాకెట్లనే ఈ ఇంటినిర్మాణంలో ఎక్కువగా  ఉపయోగించారు. ఇప్పటికే ఉప్పల్ లో 800చదరపు అడుగుల్లో 7 టన్నుల ప్లాస్టిక్ తో మొదటి ఇల్లు కట్టారు. అయితే ప్లాస్టిక్ వాడటంలోనే రిస్క్ ఉన్నప్పుడు... ప్లాస్టిక్ తో రీసైకిల్ చేసిన మెటీరియల్ తో కట్టిన ఇంట్లో ఉంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. అలాంటి అనుమానాలను కొట్టిపారేస్తున్నారు ప్రశాంత్. సాదారణ కాంక్రీట్ నిర్మాణానికి దీనికి పెద్ద తేడా ఉండదని అంటున్నారు.

వాటర్, ఫైర్ రెసిస్టెంట్ గా ఉండే ఈ ప్లాస్టిక్ హౌస్ తేలిగ్గా ముప్పై, నలభైఏళ్లు ఉంటుంది. ప్రశాంత్ ప్రయత్నాలు సక్సెస్ కావటంతో, ఇప్పటికే ప్రశాంత్ ని పలువురు సంప్రదిస్తున్నారు. కొన్ని స్కూళ్లు  బెంచీలు, కుర్చీలు చేసి ఇవ్వమని అడుగుతున్నాయట. దేశంలో 11 రాష్ట్రాలు ఇప్పటికే ప్లాస్టిక్ ని బ్యాన్ చేశాయి. అయినా ప్లాస్టిక్ వాడకం అదుపులోకి రావటం లేదు. రోజు రోజుకీ ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతూనే ఉంది. ఇలాంటి సందర్భంలో ప్లాస్టిక్ వాడకం తగ్గించే ప్రయత్నాలతో పాటు, ఆల్ రెడీ పోగుపడుతున్న వ్యర్ధాలను ఏంచేయాలో కూడా ఆలోచించాలి. వృధాగా గుట్టలుగా పడేయటం కంటే,ఇళ్లు కట్టడం దీనికి బ్రహ్మాండమైన పరిష్కారం అవుతుంది. 

నిజానికి ప్లాస్టిక్ చాలా ఉపయోగకరమైన పదార్ధం. కానీ దాన్ని లెక్కా పత్రం లేకుండా, నిబంధనలు అనుసరించకుండా వాడటం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఉపయోగిస్తూ ఇళ్లను, ఫుట్ పాత్ లను నిర్మించే ప్రయత్నాలు సీరియస్ గా సాగుతున్నాయి. ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయడమనేది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. ప్లాస్టిక్‌ ని నివారించలేం.. అందుకే దాన్ని రీసైకిల్ చేయడం మంచిదనే వాదనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగర పాలక సంస్థ  ప్లాస్టిక్ టైల్స్ ఉపయోగించి పాదచారుల కోసం ఫుట్ పాత్‌ లను నిర్మిస్తోంది. ఒక్క టైల్ తయారు చేయడానికి 600 పాలిథీన్ బ్యాగులు అవసరమవుతాయి. దీని ఖర్చు ఒక్క డాలర్, అంటే దాదాపు డెబ్భై రూపాయల కంటే తక్కువే ఉంటోంది. భారత్‌ లో పెరుగుతోన్న ప్లాస్టిక్ సమస్యకు ఇదొక పరిష్కారం అని చెప్పొచ్చు. భవిష్యత్తులో డిమాండ్ పెరిగి ప్లాస్టిక్ చెత్త  లాభాలు కురిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 









మరింత సమాచారం తెలుసుకోండి: