సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ శిష్యుల్లో ఒకరైన దర్శకుడు హరీష్ శంకర్ మాస్ మహా రాజా రవితేజ తో షాక్ అనే సినిమా తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. డైరెక్టర్ గా మంచి సత్తా ఉందని ఇండస్ట్రీలో అప్పట్లో చాలా మంది అనుకున్నారు. ఇక షాక్ నేనే చెడగొట్టాను లేకపోతే హరీష్ ఇంకా బాగా తీసేవాడని వర్మ కూడా ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ టాలీవుడ్ రికార్డ్ లను తిరగరాసింది. అంతేకాదు డైరెక్టర్ గా హరీష్ శంకర్ స్టామినా ఇది అని ప్రూవ్ చేసింది. ఆ తర్వాత బన్ని తో డి.జే తీశాడు. ఈ సినిమా షూటింగ్ టైం లో ఎన్నో వివాదాలు తలెత్తాయి. అన్నిటికి క్లారిటి ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు అదే రచ్చలు తను తెరకెక్కిస్తున్న వాల్మీకి సినిమాకి జరుగుతున్నాయి. వాస్తవంగా డైరక్టర్ హరీష్ శంకర్ ది ఒక డిఫరెంట్ స్టయిల్. 

షూటింగ్ టైమ్ లో ఏదో రకంగా వివాదాలకు కేంద్రం అవుతుంటారు ఆయన. లేటెస్ట్ గా హరీష్ శంకర్ 14 రీల్స్ పతాకంపై వాల్మీకి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా సమయంలో కూడా వివాదాలు తప్పడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇంతకముందు రాయలసీమకు వెళ్లినపుడు వాల్మీకి సామాజిక వర్గంతో వివాదం వచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఆ సంగతి అలావుంటే ఈ మధ్య షూటింగ్ టైమ్ లో ప్రొడక్షన్ యూనిట్ తో కూడా వాదనో? ఘర్షణో తలెత్తినట్లు తెలుస్తుంది. ఇది కాస్త ఎక్కువ రాద్దాంతానికే దారి తీసిందని, ఆ తరువాత సర్దుబాటు జరిగిందని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

ఇదిలా వుండగానే ఓ విషయంలో హీరో అభిప్రాయానికి మద్దతుగా నిలిచారని, తనవైపు వుండలేదని అలిగి, హరీష్ శంకర్ తన పీఆర్ టీమ్ ను ట్విట్టర్ లో అన్ ఫాలో చేసినట్లు తాజా సమాచారం. ట్విట్టర్ లో అన్ ఫాలో చేసిన మాట వాస్తవమేనని కూడా తెలుస్తోంది. అయితే మళ్లీ ఆయనే మనసు మార్చుకుని, మామూలు అవుతారని, హరీష్ కు ఇలా చిన్న పిల్లాడిలా అలగడం కామన్ అని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారట.

ఏదేమైనా మొత్తంమీద హరీష్ శంకర్ ఒక పక్క వివాదాల గాసిప్ లకు కేంద్రం అవుతూనే, సెప్టెంబర్ 13 విడుదలకు వాల్మీకిని రెడీ చేస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య రిలీజ్ చేసిన వాల్మీకి టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ మేకోవర్ అద్భుతంగా ఉందని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా హరీష్ కే చెందుతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు ఈ సినిమాతో మళ్ళీ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: