చీకట్లో ఏదీ కనిపించకపోవచ్చు, కానీ చీకట్లో దయ్యం ఉందనే నమ్మకం మనిషిని భయపెడుతుంటుంది. ఆ భయాలు అర్థరహితం. ఎందుకంటే ఈ ప్రపంచంలో దయ్యాలన్నవి లేవు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన సత్యం. దయ్యం ఉందని అనుకోడమే గానీ ఎవరూ చూడలేదు. దయ్యం ఉన్నటు నిరూపిస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ఆరు దశాబ్దాల కిందటనే ప్రముఖ హేతువాది ఏ.టి. కోవూర్‌ సవాల్‌ విసిరారు. ఆ సవాల్‌ని స్వీకరించి నిరూపించినవారు ఎవరూ లేరు.


అయినప్పటికీ దయ్యాలని ఇతివృత్తంగా తీసుకొని కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు వస్తుంటాయి. దయ్యం అన్నది కల్పన మాత్రమే. కల్పన అని తెలిసినప్పటికీ ఈనాటికీ మనుషులు దయ్యాలంటే భయపడతారు. ఈ భయానికి హేతువు లేదు. హేతుబద్ధంగా నిరూపితం కాని దాన్ని ప్రశ్నించాలన్న చైతన్యం కల్పించేవారు అరుదయ్యారు. అందుకే భూతప్రేతాలు, మంత్రతంత్రాల గురించి కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అబద్ధాలే నిజాలన్నంతగా చెలామణీలో ఉండటం గమనార్హం.


ఎందుకంటే మన సమాజంలో హేతువుకు తగిన స్థానం లేదు. శాస్త్రీయమైన ఆలోచనాధారకు చోటు లేదు. కట్టుకథలు, కల్పనల ప్రచారజాస్తి ఎక్కువ. వీటిని ప్రతిఘటించే చైతన్యం సమాజాన పాదుకోలేదు. ఈ కారణంగా అనేకానేక రంగాల్లో హేతుబద్ధ ఆలోచన కొరవడింది. ఎవరు ఏది చెప్పినా నమ్మే స్థితి నెలకొన్నది. ఏది తప్పు, ఏది నిజం అనే వివేచన లోపించింది. ఫలితంగా ప్రచార సాధనాల్లో వచ్చే సమాచారమంతా నిజమని నమ్మే వారు అధికం. కానీ ఆయా ప్రచారాల్ని కూడా ప్రశ్నించితీరాలన్న స్పృహ అవసరం. దీనిని గుర్తించే వారు స్వల్పం.


మీడియాలో వచ్చేవన్నీ నిజమని, పాలకులు చెప్పేవన్నీ సత్యాలని భావించడానికి వీల్లేదు. ఏది ప్రగతి, ఏది శాస్త్రీయం, ఏది హేతుబద్ధమన్నవి పరిశీలించి గ్రహించాలి. ఈ రకమైన పద్ధతిని అనుసరించే తెలివిడిని పిల్లలకు చిన్నతనం నుంచే అందించాలి. శాస్త్రీయ పద్ధతుల్లో నిరూపణ అయిన సత్యమే ప్రమాణంగా పరిగణించే దృక్పథాన్ని అలవరచాలి. ఇది వారి భవిష్యత్తుకీ, సమాజ పురోగతికీ మేలు చేస్తుంది. అంటే దెయ్యాన్ని పరుగెత్తించాలంటే.. ముందు మనలో అజ్ఞానాన్ని అనవసర భయాన్ని తరిమికొట్టాలన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: