రుణదాతలు, ఓ ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌, ఐటీ శాఖ మాజీ డీజీ వేధింపులు, ఒత్తిడి వల్లే తాను చనిపోతున్నానని కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) వ్యవస్థాపక అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్య  ఓ లేఖలో సిద్ధార్థ పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పుల భార‌తంలో ఆత్మ‌హ‌త్య అనేక‌మందిని క‌ల‌చివేసింది. సిద్ధార్థ ఆత్మహత్య నేపథ్యంలో రుణ భారాన్ని తగ్గించుకోవడంపై సంస్థ సీరియస్‌గా దృష్టి సారించింది. సంస్థ నిర్ణ‌యాల‌తో కెఫేకాఫీడే  సంస్థ రుణ భారం భారీగా తగ్గిపోనుంది. మొత్తం సంస్థాగత అప్పుల విలువ దాదాపు రూ.1,000 కోట్లకు పరిమితం కానుందని సీసీడీ ప్రకటించింది.


కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (సీడీఈఎల్‌) ప్రమోటింగ్‌ సంస్థలుగా ఉన్న దేవదర్శిని ద్వారా రూ.542 కోట్లు, గొనిబేడు కాఫీ ద్వారా రూ.450 కోట్లు, కాఫీ డే కన్సాలిడేషన్స్‌ ద్వారా రూ.200 కోట్లు, శివన్‌ సెక్యూరిటీస్‌ ద్వారా రూ.42 కోట్ల అప్పును సిద్ధార్థ చేశారు. ఇలా మొత్తం రూ.1,234 కోట్ల రుణాలను పొందారు. ఆదిత్యా బిర్లా ఫైనాన్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏకే క్యాపిటల్‌, ఎస్‌టీసీఐ ఫైనాన్స్‌, ఏపీఏసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎస్‌ఎస్‌జీ ఆసియా తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్నారు. సిద్ధార్థ వ్యక్తిగత రుణ భారమే రూ.వెయ్యి కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తున్నది. 


కాగా, గ్రూప్ అప్పుల భారం త‌గ్గించ‌డంలో భాగంగా, బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు అమ్మేస్తున్నారు. ఈ లావాదేవీతో సంస్థ అప్పులు బాగా తగ్గిపోనున్నాయని సీసీడే స్పష్టం చేసింది. ఈ టెక్‌ పార్క్‌.. సీసీడీ అనుబంధ సంస్థ తంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌ లిమిటెడ్‌ది. ఈ పార్క్‌ అమ్మకంతో రూ.2,600 కోట్ల నుంచి రూ.3,000 కోట్లు రావచ్చని అంచనా. ఈ ఏడాది జూలై 31 నాటికి సంస్థ రుణ భారం రూ.3,472 కోట్లుగా ఉందని సీసీడీ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తాజా అమ్మ‌కంతో రూ.2,400 కోట్ల విలువైన రుణాలను చెల్లిస్తున్నామని సీసీడీ తాజాగా వెల్లడించింది. దీంతో అప్పులు పెద్ద ఎత్తున త‌గ్గిపోనున్నాయ‌ని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: