జ‌మ్మూక‌శ్మీర్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో...పాకిస్థాన్ మ‌న‌దేశంపై విష‌భావాల‌ను మ‌రింత పెంచుకుంటోంది. ఇంటా, బ‌య‌ట‌, త‌మ దేశ పౌరుల్లో దురుద్దేశాల‌ను నాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అవసరమైతే అణుబాంబులు వేయడానికైనా వెనకాడబోమని  భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై మండిపడ్డారు. అతని మాటలు భాద్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయన్నారు. 


తాజాగా పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి మీడియాతో మాట్లాడుతూ రాజ్‌నాత్ సింగ్ ప్ర‌క‌ట‌న‌ను ఖండిస్తున్నామ‌న్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిని రక్షణశాఖ మంత్రిగా ఎన్నుకోవడం భారత్ చేసుకున్న దురదృష్టమన్నారు. కాశ్మీర్ విషయంలో భారత్ సరైన రీతిలో నిర్ణయం తీసుకోలేదని త‌ప్పుప‌ట్టారు. కనీసం అసెంబ్లీ తీర్మానం లేకుండా ప్రజలను సంప్రదించకుండా అధికరణ 370 రద్దు చేయడమేమిటని ఈ సందర్భంగా ఆయన ప్ర‌శ్నించారు. ఈ నిర్ణయం వారి మూర్ఖత్వానికి, అవివేకానికి నిదర్శమన్నారు. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావిస్తామని, కావాలంటే చైనా, అమెరికాల మద్దతు కూడగడతామన్నారు. ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే కాశ్మీర్ అంశం భారత్ అంతర్భాగమనీ, అందులో మేము జోక్యం చేసుకోదల్చుకోలేమని అమెరికా, చైనాలు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ పాక్ పాత పాటే పాడుతోంది.


కాగా, హర్యానాలో జరిగిన జాన్ ఆశీర్వాద్ ర్యాలీలో మాట్లాడుతూ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  పాకిస్తాన్‌కు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదం వీడే వరకు పాక్‌తో చర్చలు ఉండవని ఆయన స్పష్టంగా చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌తో పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)లో మాత్రమే భారత్ మాట్లాడుతుంది’’ అని ఆయన అన్నారు. ``ఆర్టికల్ 370 రద్దు అయ్యింది. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి మొదలైంది. కానీ మన పక్క దేశం మాత్రం భారత్ తప్పు చేసిందంటూ మిగిలిన దేశాల తలుపులు తట్టుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ ఎప్పుడైతే ఆపుతుందో అప్పుడే ఆ దేశంతో మాట్లాడుతాం. ఇప్పుడు పాక్‌తో మాటలంటే.. అది పీవోకేలో మాత్రమే. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బాలాకోట్ కంటే పెద్ద దాడిని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. అంటే ఆయనకు బాలాకోట్ దాడి ఎంత పెద్దదో ఇప్పుడు తెలిసిందనుకుంటా`` అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: