తెలుగు కాంగ్రెస్ అన్నది నిన్నటి ముచ్చట. ఇపుడు ఆ ప్లేస్ లోకి వచ్చింది తెలుగు బీజేపీ. అంటే మరేమీ లేదు. పసుపు కాషాయం కలవడం. ఈ రెండు కలిస్తే కొత్త రంగు పుట్టదు కానీ కొత్త సమీకరణలు మాత్రం పుడతాయి. ఏపీలొ నోట కంటే ఓట్లు తక్కువ వచ్చిన బీజేపీకి ఇంతటి వైభోగం ఏంటి అని ఆశ్చర్యపోనవసరం లేదు. కేంద్రంలో అధికారంలో ఉందిగా. దాన్ని దండీగా వాడుకునే సత్తా  ఇక్కడ కలిసానికి కూడా కాకుండా పోయినా సైకిల్ పార్టీకి ఉంది.


అందుకే ఈ కొత్త కాంబోలు ముందుకు వస్తున్నాయి. ఎంత వింత కాకపోతే 23 సీట్లు గెలిచి 40 శాతం వరకూ ఓటు షేర్ సంపాదించుకున్న టీడీపీని వదిలేసి బీజేపీలో చేరడమట. ఎందుకంటే ఏపీలో బీజేపీ బాగుపడుతుందట. రేపటి రోజున అధికారంలోకి వస్తుందట. ఇది చేరిన వారికీ నమ్మకం లేదు, చేర్పించుకున్న వారికి అంతకంటే నమ్మకం లేదు. కానీ  ఇదంతా ఓ పొలిటికల్ డ్రామాగా సాగిపోతోంది.


దీనికి తెరవెనక సూత్రధారులు చాలామంది ఉన్నారు. బీజేపీ వైసీపీ నిన్నటి మిత్రులు, ఆ స్నేహం చెడగొడితే ఏపీలో టీడీపీ సులువుగా పాగా వేయవచ్చు. అన్నిటికంటే ముందు టీడీపీతో బీజేపీకి ఉన్న వైరాన్ని కడిగేసుకోవచ్చు. మోడీని బండబూతులు తిట్టి ఏపీలో అడుగుపెట్టనీయబోమని చెప్పిన బాబు మళ్ళీ కాషాయదళంతో చెట్టపట్టాలు వేయవచ్చు. అక్కడ ఉన్నది కూడా తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళే కాబట్టి బీజేపీ అధికారం కూడా తనదిగా ఫీల్ అవవచ్చు.


ఇలా ఎన్నోరాజకీయ  లాభాలు. ఇక బాబు అవినీతిని బయటపెడతాం అని రంకెలేసిన కన్నా లక్ష్మీనారాయణలు, సోము వీర్రాజుల గొంతు అసలు వినిపించడంలేదుగా. చంద్రబాబుకు జైలే గతి అన్న రాజ్య‌సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు వంటి వారి అయిపూ అజా లేదుగా. ఉండదు కాక ఉండదు, ఎందుచేతనంటే  తెలుగు బీజేపీలో కొత్త గొంతులు అన్నీ తమ్ముళ్ళవే. ఆ గొంతుల్లో వినిపించేవి  కూడా చంద్రబాబు చిలకపలుకులే. ఆలా జనంలో బీజేపీ కూడా జగన్ పాలనని తప్పు పడుతోందనిపించి మరింత బదనాం చేయవచ్చు


. బాబు చెప్పిందే కరెక్ట్ అనిపించి టీడీపీకి మరింత హైప్ క్రియేట్ చేయవచ్చు. అందుకే నిన్నటి టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని వంటి వారు కూడా  ఇపుడు బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. ఫర్ సపోజ్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏపీలో టీడీపీ ఓడిపోయినా కూడా ఈ బ్యాచ్ టీడీపీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయేది. ఇది ఫక్త్ బాబు ప్లాన్ అంటున్నారంతా. సుజనా చౌదరితో మొదలైన ఈ తెలుగు బీజేపీ జీడి పాకం సీరియల్లో ఇంకా ఎన్నో మలుపులు  ఉన్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: