కృష్ణానది వరదల విషయంలో మాజీ సీఎం చంద్రబాబు జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. వరద నిర్వహణలో వైకాపా ప్రభుత్వం విఫలం చెందిందని చంద్రబాబు ఆరోపించారు. వరద తీవ్రత అంచనాలో, ముందస్తు జాగ్రత్తలలో వైఫల్యం చెందారన్నారు. ఎక్కడెక్కడ వరద, ఎంతెంత వస్తే, ఏం చేయాలో స్పష్టమైన నిర్దేశం లేదని విమర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లా తెదేపా నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నియంత్రణ వదిలేసి తనను, తన నివాసం చుట్టూ తిరిగారని మండిపడ్డారు.


తనను, తన నివాసాన్ని టార్గెట్‌ చేయడమే వైకాపా లక్ష్యమని ఆయన దుయ్యబట్టారు. వరద నిర్వహణను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. తనపై కక్ష సాధింపుతో రాష్ట్రానికి నష్టం, పేదలకు కష్టం చేస్తున్నారని విమర్శించారు. చౌకబారు రాజకీయాలకు వైకాపా పాల్పడుతోందని మండిపడ్డారు. తపపై కక్షతో లక్షలాది ప్రజలను వరదల్లో ముంచేశారని ఆరోపించారు.


పదేళ్ల తరువాత కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తిందని ఆయన అన్నారు. వరద నిర్వహణలో తొలిరోజు నుంచి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. దీనిని మనిషి చేసిన విపత్తుగానే చూడాలన్నారు. ఈ మేన్ మేడ్ డిజాస్టర్ కు బాధ్యత వైకాపా ప్రభుత్వానిదేనన్న చంద్రబాబు..రాజధాని కూడా మునిగిపోతుందనే దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. తప్పుడు పనులు చేయడమే వైకాపా లక్ష్యమని ఆయన అన్నారు.


మాజీ సీఎం ఇంటికి నీళ్లు వచ్చాయని చూపడం కోసం లక్షలాది కుటుంబాలతో ఆడుకున్నారని, అందరి ఇళ్లు ముంచేయాలని చూశారని ఆగ్రహంవ్యక్తంచేశారు. వేల ఎకరాల్లో పంటలను నీట ముంచారని దుయ్యబట్టారు. వరద నిర్వహణతో వైకాపా నేతలు చెలగాటాలు ఆడారని దాని ఫలితమే ఇప్పుడీ అపార నష్టమని అన్నారు. కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్ అమెరికా వెళ్లారని మండిపడ్డారు. గోదావరి వరదల్లో జెరూసలెం పర్యటన, పరిపాలనపై వీళ్లకు సీరియస్‌నెస్ లేదు, పేదల సంక్షేమంపై, రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ లేదని చంద్రబాబు ఆక్షేపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: