1,480 గజాల స్థలం కోసం శతాబ్దాలుగా ‘మందిర్-మసీదు వివాదం’ కొనసాగుతోంది. ఈ వివాదాస్పద స్థలానికి సంబంధించి విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1528లో బాబర్ రాకతో రామమందిరాన్ని కూల్చివేశారనేది ఒక కథనమైతే, ముంబయిలోని పురావస్తు గ్రంథాలయంలో లభించిన అముద్రిత గ్రంథాల ఆధారంగా చూస్తే రామమందిరాన్ని క్రీస్తు పూర్వం 1426లోనే కూల్చేశారన్న ప్రచారం ఉంది. అంటే దాదాపు 3,445 ఏళ్లుగా ఈ వివాదం ఉంది.


1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు నాలుగు పిటిషన్లను విచారించి సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా , రాం లల్లా విరజ్‌మాన్ సంస్థలు 2.77 ఎకరాల స్థలాన్ని సమానంగా పంచుకోవాలని ఇచ్చిన తీర్పు అయోధ్య వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో 11 పిటిషన్లు దాఖలయ్యాయి. వా టిపై విచారణ మొదలయ్యాక, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని సుప్రీం కోర్టు భావించి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించింది.


అయితే, హైదరాబాద్‌లో నివసిస్తున్న మొఘల్ వంశస్థుడు హబీబుద్దీన్ టసీ (50) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బాబ్రీ మసీదు-రామజన్మభూమి స్థలాన్ని తనకు ఇస్తే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు మొదటి ఇటుకను తానే ఇస్తానని, అది కూడా బంగారు ఇటుకను ఇస్తానని గతంలో చేసిన ప్రతిపాదనను  పునరుద్ఘాటించారు. అలాగే ఆ మొత్తం స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం అప్పగిస్తానని టసీ శనివారం ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన బహదూర్‌షా జఫర్‌కు ఆరో తరం వారసుడైన టసీ గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ ప్రతిపాదన చేశారు. బాబ్రీ మసీదు వివాదంలో తనను కూడా కక్షిదారుగా చేర్చాలని కోరుతూ ఫిబ్రవరి 8న ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు ఇంకా అంగీకరించలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: