సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్ త‌ను అని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొద్దికాలం క్రితం పోజులు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అధికారిక బంగ్లాను వద్దన్న ఇమ్రాన్‌ఖాన్.. మిలిటరీ సెక్రటరీ నివాసంలోని ఓ చిన్న పోర్షన్‌లో ఉంటున్నారు. అంతేగాకుండా ఖర్చులను తగ్గించుకునేందుకు కేవలం రెండు ప్రభుత్వ వాహనాలు, ఇద్దరు నౌకర్లను మాత్రమే పెట్టుకుని ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల దుబారాను తగ్గించడంలో భాగంగా ప్రభుత్వాధిపతులు, ఉన్నతాధికారుల విమాన ప్రయాణాలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్థాన్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి మొదలుకొని చీఫ్ జస్టిస్, సెనేట్ చైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఇకపై విమానాల్లో ఫస్ట్‌క్లాస్‌లో కాకుండా క్లబ్/బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణం చేయాలి.


అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్ర‌చారం అధికారుల వ‌ర‌కే పరిమితం అయింద‌ని నెటిజ‌న్లు పంచులు వేస్తున్నారు. తమ ప్రభుత్వ పాలనలో వీవీఐపీ కల్చర్‌ను లేకుండా చేస్తామని పాక్ ప్రధాని వాగ్దానం చేసినా..ఇమ్రాన్‌ ఖాన్‌ మాటలను కనీసం ఆయన సోదరి అలీమా ఖాన్ కూడా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్లిన అలీమా ఖాన్.. అక్కడ క్యూలైన్‌ ను పట్టించుకోకుండా నేరుగా ఇమ్మిగ్రేషన్ ఆఫీసుకు వెళ్లిపోయారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన నెటిజన్లు.. పాక్‌ ప్రధాని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.  వీవీఐపీ కల్చర్‌ ను ప్రధాని ఇంటివాళ్లే పట్టించుకోవడం లేదంటూ ఆయనపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

కాగా, ప‌లు చ‌ర్య‌ల‌తో పొదుపు మంత్రం ప‌టించే ప్ర‌య‌త్నం చేశారు ఇమ్రాన్‌ఖాన్. పాకిస్థాన్ ప్రధానిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి విదేశీ నాయకులను, ప్రముఖులను పిలువకూడదని నిర్ణ‌యం తీసుకున్నారు. అధ్యక్షుడి భవనంలో జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం చాలా సాదాసీదాగా ఉండాలని ఆయన తెలిపారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన‌ అమెరికా పర్యటనలో హోటల్‌లో బస చేయరాదని ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయించుకున్నారు. అమెరికా పర్యటన సమయంలో వాషింగ్టన్‌లోని పాక్ రాయబారి అధికారిక నివాసంలోనే బస చేశారు ఇమ్రాన్‌ఖాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: