దేశంలో మ‌రోమారు రిజ‌ర్వేష‌న్లు ఎత్తేసే అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. భారతీయ జ‌న‌తాపార్టీ మాతృక అయిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ మ‌ళ్లీ ఈ తేనెతుట్టెను క‌దిపింది  దేశంలో రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని దాదాపు 4 సంవ‌త్స‌రాల కింద‌ట వ్యాఖ్యానించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తాజాగా తెలిపారు. 2015లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో భగవత్ మాట్లాడుతూ, ప్రస్తుత విధానంలో అర్హులైనవారికి రిజర్వేషన్ల ఫలాలు అందడంలేదన్నదే తన అభిప్రాయమని, అందుకే వాటిని సమీక్షించాలని కోరుతున్నానని తెలిపారు. రిజర్వేషన్లను సమీక్షించాలన్న భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీయడంతోపాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులను సృష్టించాయి. 


అయితే, తాజాగా మ‌ళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ అదే వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ‘జ్ఞాన్ ఉత్సవ్’ ముగింపు సభలో పాల్గొన్న భ‌గ‌వ‌త్ మ‌ళ్లీ రిజ‌ర్వేష‌న్ల‌పై స్పందించారు. రిజర్వేషన్లపై సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరగాలని  సూచించారు. రిజర్వేషన్ల అనుకూలురు, వ్యతిరేకులు ఎదుటి పక్షం ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని వాదనలు వినిపించాలని అన్నారు.  తాను గతంలో కూడా దీనిపై చర్చను లేవనెత్తానని... కానీ, అది పూర్తిగా పక్కదోవ పట్టిందని వాపోయారు. రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకిస్తున్న వారి భావాలను అర్థం చేసుకోవాలని, అలాగే వాటిని వ్యతిరేకిస్తున్న వాళ్లు అనుకూలంగా ఉన్న వారి ప్రయోజనాలను కూడా ఆలోచించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం వేర్వేరని, బాధ్యతలు కూడా విభిన్నమని భ‌గ‌వ‌త్‌ అన్నారు. ‘‘చాలా మంది సంఘ్‌ కార్యకర్తలు బీజేపీలోను, ప్రభుత్వంలోనూ ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పేది వారు వింటారు. కానీ దానిని తప్పనిసరిగా అమలు చేయాలని ఏమీ లేదు. వారు విభేదించవచ్చు కూడా’’ అని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: