తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు  జగన్ సర్కార్ ఒక్కొక్కటిగా మారుస్తూ వస్తోంది .  తాజాగా చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరు వైయస్సార్ పెళ్లి కానుక గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్టీఆర్ భరోసా పేరిట గత ప్రభుత్వ హయాం లో  వికలాంగులకు ,  వృద్ధులకు అందజేసిన పెన్షన్ పథకం పేరును వైఎస్సార్ పింఛన్ గా మార్చిన విషయం తెలిసిందే. అలాగే మధ్యాహ్న భోజన పథకం పేరును వైయస్సార్ అక్షయపాత్ర గా మార్చారు. చంద్రన్న భీమా పథకం తోపాటు , అన్నా క్యాంటీన్ల పేరును కూడా వైస్సార్ క్యాంటీన్లు గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .


ఒకవైపు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తున్న జగన్ సర్కార్ , అభివృద్ధి పథకాల్లో జరిగిన అవినీతిని ప్రజల ముందు పెట్టేందుకు సమీక్షించాలని భావిస్తోంది . పోలవరం పథకం లో పెద్ద ఎత్తున అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ , కాంట్రాక్టర్ ను తప్పించి , రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన విషయం తెల్సిందే . ఇక విద్యుత్ ఒప్పందాల్లోనూ అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని , విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించి తక్కువ ధరకు కోడ్ చేసే వారికి కాంట్రాక్ట్ కట్టబెడుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విస్పష్టంగా పేర్కొంటున్నారు . ఇక కృష్ణానది కరకట్టపై టీడీపీ ప్రభుత్వ హయాం లో  నిర్మించిన ప్రజావేదిక ను కూల్చివేశారు .


 గత ప్రభుత్వ హయాం లో ప్రవేశపెట్టిన పథకాల పేర్ల మార్పు , అభివృద్ధి పనుల సమీక్ష, అక్రమ నిర్మాణాల కూల్చివేత వంటి నిర్ణయాలను పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . రాజకీయాల్లో తలపండిన వారికి కూడా అంతుచిక్కని విధంగా టీడీపీ ని రాజకీయంగా చావుదెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: