ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీమమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైఎస్సార్‌ కాంగ్రెస్ తరపున నామినేష‌న్లు వేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఏక‌గ్రీవం అయ్యారు. వైసీపీకి అసెంబ్లీలో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండ‌డంతో మూడు సీట్లు ఆ పార్టీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఇక టీడీపీ క‌నీసం అభ్య‌ర్థిని పోటీ పెట్టేందుకు కూడా సాహ‌సించ‌ని ప‌రిస్థితి. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. 


అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. దీంతో లాంచ‌నం ముగిసిన‌ట్ల‌య్యింది. ఇక ఐదేళ్ల పాటు ఇటు ఎమ్మెల్సీల‌తో పాటు అటు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లోనూ అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఈ ఐదేళ్ల‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా ద‌క్కే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలోనే వైసీపీ ప‌ద‌వుల వేట ఈ మూడు ఎమ్మెల్సీల‌తో ప్రారంభించిన‌ట్ల‌య్యింది.


ఇక ఏక‌గ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీల్లో హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్ మహ్మద్‌ ఇక్బాల్‌ ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలా మందికి ఎమ్మెల్సీలు ఇస్తాన‌ని హామీ ఇచ్చినా తొలి విడ‌త‌లో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు బేరీజు వేసుకుని ఈ ముగ్గురుకి మాత్ర‌మే ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇచ్చారు.

ఈ ముగ్గురిలో కూడా రెడ్డి వ‌ర్గం నుంచి రామ‌కృష్ణారెడ్డి, మైనార్టీ వ‌ర్గం నుంచి ఇక్బాల్‌, బీసీ కోటాలో మంత్రి మోపిదేవికి ప‌ద‌వులు వ‌చ్చాయి.
ఇక మ‌రో 15 మంది నేత‌ల వ‌ర‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌ను ఆశిస్తున్నారు. వీరిలో చాలా మందికి జ‌గ‌న్ నుంచి బ‌హిరంగంగా హామీ కూడా వ‌చ్చింది. రెండున్న‌రేళ్ల త‌ర్వాత జ‌రిగే మంత్రివ‌ర్గంలో కొత్త‌వారికి చోటు క‌ల్పించ‌నున్న నేప‌థ్యంలో తర్వాత విడ‌త‌లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. ఇక తెలంగాణ‌లో ఎన్నిక జ‌రిగిన ఏకైక ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్‌కు చెందిన సీనియ‌ర్ నేత గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి ఏక‌గ్రీవంగా గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: