తెలంగాణలో బిజెపి తమ పార్టీని పటిష్ట పరచుకునే లోపే అధికారపక్షం నుంచి అతను సుడిగాలిలా వచ్చి గట్టిదెబ్బ తీశాడు. తెలంగాణలో తెరాస ఆధిపత్యం ఎప్పటికీ పడిపోకుండా చూస్తున్న ఆ యువనేత ఇప్పుడు కూడా బిజెపి ఆశలకు గండి కొట్టే పనిలో పడ్డాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ దిశలో మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు. ఇదంతా చెబుతున్నది తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కొడుకు కేటీఆర్ గురించే. 

బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జేపి నడ్డా తెలంగాణలో అడుగు మోపిన తర్వాత చేపట్టిన చర్యల పై కేటీఆర్ ఒక రేంజ్ లో పంచులు విసిరారు. “మొన్న ఢిల్లీ నుండి ఒక నేత వచ్చారు. ఆయన పేరు జేపీ నడ్డా… ఆయన చెప్పింది అంతా “అబద్దాల అడ్డా” అంటూ ప్రసంగించాడు. ఇలాంటి రకమైన సెటైరికల్ పంచులు తెలంగాణ ప్రజల్లో చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అని గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబుని… కెసిఆర్ మరియు కేటీఆర్ ఇలాంటి పంచులతోనే ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ప్రసంగాలకు చాలా మంది యువత ఆయన అభిమానులుగా మారిపోయారు.

కేవలం పంచులతోనే కాకుండా కేంద్రంలో బీజేపీ పనితీరును ప్రశ్నిస్తూ… తమ ప్రభుత్వం తో వారిని పోలుస్తూ అతను అన్న మాటలు తూటాల్లా పేలాయి. మొత్తం దేశంలోని 28 రాష్ట్రాల్లో బిజెపి 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. వాటిలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా రైతులకు వ్యవసాయం కోసం 24 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించాడు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఇస్తుంది అని గుర్తు చేశాడు. పింఛన్ల కోసం కేంద్రం కేవలం 200 కోట్ల రూపాయలు ఇస్తుంటే తాము మాత్రం తమ రాష్ట్రం నుండి 10 వేల కోట్ల రూపాయలతో 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. 

అలాగే బిజెపి నేతలు ప్రతిష్టాత్మకమైన కాలేశ్వరం ప్రాజెక్టు పైన ఏడుస్తున్న తీరును తప్పుబడుతూ ఎన్నో సెంట్రల్ ఏజెన్సీలు కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ను ప్రశంసిస్తుంటే చూసి ఓర్వలేక వీరు ఏడుస్తున్న తీరును ఏమని అనాలి అని ఆయన ఫైర్ అయ్యాడు. మొత్తానికి బిజెపి వచ్చి తమ రాష్ట్రంలో కొత్తగా చేసేది ఏమీ లేదని…. వాళ్లు సాధించిన నాలుగు లోక్ సభ సీట్లతో ఎగిరెగిరి పడుతున్నారని… అదే పార్టీ 103 అసెంబ్లీ స్థానాలను కూడా కోల్పోయిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశాడు. అబద్ధపు ఆరోపణలు మరియు కామెంట్లు చేసే ముందు రుజువులు తీసుకొచ్చి మాట్లాడితే మంచిది అని హితబోధ చేశాడు. 

అలా కమలనాథులని కేటీఆర్ భవిష్యత్తులో వారికి కొరకరాని కొయ్యగా మారుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వారి దృష్టి అంతా కేటీఆర్ నిలువరించడం పైనే పడింది. అతని దాటితేనే వారు తెలంగాణ గడ్డను తమ అడ్డాగా మార్చుకోగలుగుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: