తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ నాటుసారా పడగ విప్పుతుంది. అన్ని దారుల్లో నాటు సారాను అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారులు ఈ సారి సముద్ర మార్గాన్నే ఎంచుకున్నారు. మడ అడవుల్లో తయారవుతున్న నాటు సారాను గుట్టుగా పడవల ద్వారా తీరానికి తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. దీంతో అధికారులు తీరాల్లో నిఘా పెట్టి వందల కొద్దీ లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకుంటున్నారు. అయితే ఈ అక్రమ బాగోతం వెనుక టిడిపి నేతలు ఉండటం విశేషం. తూర్పు గోదావరి జిల్లాలోని నిత్యం వేలాది మంది మత్స్యకారులు సముద్ర తీర ప్రాంతం నుంచే వేటకు వెళ్తుంటారు. అయితే గత కొంతకాలంగా కొందరు అక్రమార్కులు మత్స్యకారుల ముసుగులో బోట్లు వేసుకుని నాటు సారాను సముద్ర మార్గం గుండా తీరానికి తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.

ఇలా రవాణా అవుతున్న సారాను కాకినాడ సమీపంలో ఉన్న  గ్రామాల్లో విక్రయిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారులోని గిడియన్ పేటకు చెందిన కొందరు వ్యాపారులు సమీపంలోని మడ అడవులను సారా తయారీ కేంద్రాలుగా వాడుకుంటున్నారు. ఈ ప్రాంతమైతే పోలీసుల పెట్రోలింగ్ ఉండదు. ఎక్సైజ్ అధికారుల బారి నుంచి సులువుగా తప్పించుకోవచ్చు అన్న అంచనాలతో గిడియాన్ పేటకు చెందిన వారు మడ అడవుల్లో సారాబట్టీలు నిర్వహిస్తున్నారు. ఇలా మడ అడవుల్లో తయారైన నాటుసారా పడవల సహాయంతో రాత్రి వేళల్లో హోప్ ఐలాండ్ మీదుగా కాకినాడ సూర్యారావుపేట బీచ్ సమీపంలోకి చేరుకుంటుంది.


దీంతో ఇటీవల సముద్ర మార్గం గుండా రవాణా అవుతున్న నాటుసారాపై నిఘా పెట్టిన కాకినాడ నార్త్ జోన్ ఎక్సైజ్ పోలీసులు ఓ మరపడవను పట్టుకుని అందులో ఉన్న పన్నెండు వందల లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకున్నారు. ఇటీవల కాకినాడ తీరంలో పట్టుబడిన నాటుసారా కేసులో ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీ అయ్యారు. ఇక ఇటీవలే గోదావరి వరద నేపధ్యంలో కోరంగి మడ అడవుల్లోకి తిరగటం కష్టమైన నేపధ్యంలో పోలీసులు నిఘా తగ్గింది. దీంతో ఈ ప్రాంతంలో మళ్లీ నాటుసారా తయారీ జోరందుకుంది. గత ఎన్నికల సమయంలో కూడా ఇలానే పడవల ద్వారా రవాణా అవుతున్న నాటుసారాను ఎక్సైజ్ అధికారులు అరికట్టగలిగారు.


అయినప్పటికీ అక్కడి భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన పెంచుకున్న గిడియాన్ ప్రజలు నాటుసారా తయారీని వదలలేక పోతున్నారు. మరోవైపు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా నాటుసారా కేసులు నమోదవుతున్నాయి. సారాతో పట్టుబడినప్పుడు పెట్టే కేసులతో పాటుగా అదనంగా పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తున్నప్పటికీ కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. కాకినాడ తీరంలో పట్టుబడిన నాటుసారా కేసులో నిందితుడు మేడిశెట్టి బుజ్జి తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాకినాడ రూరల్ కి చెందిన ఈయన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడు.ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు బుజ్జి కోరంగి మడ అడవుల నుంచి పెద్ద ఎత్తున నాటుసారా తరలిస్తూ రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏకంగా సారా సంచులపై ఎమ్మెల్యే దంపతులు ఉన్న ఫ్లెక్సీ ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా టిడిపి నేతల ఒత్తిడితో ఈ కేసు తీవ్రతను పోలీసులు తగ్గించారన్న ఆరోపణలొచ్చాయి. నాటుసారా వ్యాపారానికి అలవాటు పడిన బుజ్జి గత రెండ్రోజుల కిందట మళ్లీ అదే ప్లేసులో సారాను బోట్లో తరలిస్తు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో జిల్లాలో నాటుసారా వ్యాపారాల వెనుక టిడిపి నేతల హస్తం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: