జ‌బ‌ర్ద‌స్త్ రోజా.. న‌టిగా ఎంత గుర్తింపు సాధించిందో.. రాజ‌కీయ నాయ‌కురాలిగా కూడా అంతే గుర్తింపు పొందింది. నేడు ఆమెకు పోటీ రాగ‌ల నాయ‌కురాలు ఏపీలోనే లేరంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఆమెకు సాటిగా, ఆమెకు పోటీగా ఎవ‌రైనా ఉన్నారాని అనేక మంది మేధావులు దుర్భిణీ వేసి చూసినా.. ఎవ‌రూ క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా టీడీపీని, ఆ పార్టీ నేత‌ల‌ను ఉతికి ఆరేయ డంలో రోజా సాటి నాయ‌కురాలు మ‌న‌కు క‌నిపించ‌రు. నిజానికి ఆమె రాజకీయ అరంగేట్రం ఈ పార్టీ నుంచే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. 


టీడీపీలో ఉండ‌గా.. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్య‌లు నేటికీ రాజ‌కీయంగా సంచ‌ల‌నాలే. అప్ప‌ట్లో కాంగ్రెస్ నేత‌ల‌ను పంచెలూడ‌దీసి కొడ‌తాం..! అంటూ ఆమె మ‌హానాడు సాక్షిగా చేసిన వ్యాఖ్య చాన్నాళ్ల‌పాటు ఆమెను రాజ‌కీయంగా నిల‌బెట్టింది. ఇక‌, అప్ప‌ట్లోనే పోటీ చేసినా.. ఓట‌మిపాల‌య్యారు. దీంతో ఐర‌న్ లెగ్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే 2009లో ఆమె వైఎస్‌ను క‌లిశారు. అయితే, కొన్నాళ్ల‌కు ఆయ‌న దుర్మ‌ర‌ణంతో కాంగ్రెస్‌లోకి వెళ్లాల‌నే రోజా ప్ర‌య‌త్నం కూడా ఆగిపోయింది. 


ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌యుడు,నేటి ఏపీ సీఎం జ‌గ‌న్ పెట్టిన పార్టీలోకి చేరారు. అప్ప‌టి నుంచి కూడా ఆమె యాక్టివ్ రోల్‌లోనే ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో తొలి విజ‌యం అందుకున్న రోజా.. టీడీపీ దిగ్గ‌జం, మాజీ మంత్రి దివంగ‌త గాలి ముద్దు కృష్ణ‌మ‌ను న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించారు. ఆ త‌ర్వాత అటు పార్టీలోనూ ఇటు జ‌బ‌ర్ద‌స్త్ ప్రీమియ‌ర్ షోలోనూ త‌న స‌త్తా చాటారు. ఇక‌, అసెంబ్లీలో చంద్ర‌బాబుకు కంట్లో న‌లుసుగా మారారు. టీడీపీ నేతల‌పై విమ‌ర్శ‌లు సంధించ‌డంలోను, సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంలోను రోజా త‌న‌కు తానే సాటి అని అనిపించుకున్నారు. 


ఈ క్ర‌మంలోనే రోజాకు దీటుగా చంద్ర‌బాబు ఎవ‌రైనా నాయకురాలిని రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌కు ఆరు మాసాలముందు వాణీ విశ్వ‌నాథ్ ను తీసుకు వ‌చ్చారు. ఆమె కూడా పార్టీలో చేరేందుకు అవ‌సర‌మైతే న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు, రోజాను ఓడించేందుకు కూడా తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఆమెపై చేయించిన స‌ర్వేలో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ఆమెను ప‌క్క‌న పెట్టారు. ఆ త‌ర్వాత మ‌రో న‌టి దివ్య‌వాణిని రంగంలోకి దింపారు. 


ఆమెకు వాయిస్ పెద్ద‌గా లేక పోవ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇచ్చే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో మౌనం వ‌హించారు. ఇక‌, పార్టీలోని పంచుమ‌ర్తి అనురాధ‌, యామినీ శ‌ర్మ వంటివారు ఉన్నా.. రోజాకు సాటి రాగ‌ల నాయ‌కురాళ్లుగా పేరు తెచ్చుకోలేక పోయారు. ఇక‌, పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వంగ‌ల‌పూడి అనిత‌, పీత‌ల సుజాత‌, ప‌రిటాల సునీత వంటివారు కూడా రోజా ధాటికి చేతులు ఎత్తేశారు. ఆమెలా రాజ‌కీయాలు మేం చేయ‌లేం అంటూ బాహాటంగానే ఒప్పుకొన్నారు. ఇక‌, ఇప్పుడు వీరంతా ఓట‌మి పాల‌వడం, వ‌రుస‌గా రెండోసారి రోజా న‌గ‌రిలో జెండా ఎగ‌రేయ‌డం, ఎపీఐఐసీ చైర్ ప‌ర్స‌న్‌గా జ‌గ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం వంటి ప‌రిణామాలు చ‌కాచ‌కా సాగిపోయాయి. 


ఇలా రోజా పుంజుకుంటుంటే.. టీడీపీ ఎవ‌రినైతే రాజోకు దీటుగా న‌మ్ముకుందో వారంతా పార్టీ మారేందుకు, చంద్ర‌బాబుకు బై చెప్పేందుకు రెడీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇక‌, టీడీపీలోనే కాకుండా బీజేపీ స‌హా ఏ పార్టీలోనూ రాజాకు సాటిరాగ‌ల నాయ‌కురాలు లేర‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: