ఉన్నవ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది . ఈ కేసు విచారణ గడువును మరో రెండు వారాలకు సుప్రీం కోర్టు పొడిగించింది . జస్టిస్ దీపక్ గుప్తా అనిరుధ్ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది . ఉన్నవ్ అత్యాచార బాధితురాలు ఆమె లాయర్ పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో వారి స్టేట్ మెంట్ రికార్డ్ చేయలేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది . విచారణకు తమకు నాలుగు వారాల సమయం అదనంగా కావాలని కోరింది .


సీబీఐ వాదన విన్న సర్వోన్నత న్యాయ స్థానం నాలుగు వారాల సమయం ఇవ్వలేమని, రెండు వారాల సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది . ఇంతకముందు నలభై రోజుల్లో విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐని ఆదేశించిన కోర్ట్ ఇప్పుడు ఆ గడువును మరో రెండు వారాలకు పెంచింది . మరో పక్క ఉన్నవ్ బాధితురాలి లాయర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన చికిత్స కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని యూపీ సర్కార్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. గత రెండేళ్ల నుంచి ఉన్నావ్ రేప్ కేస్ బాధితురాలు న్యాయం కోసం పోరాడుతున్నారు.


పదిహేడేళ్ళ బాలికపై స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట్లో యూపీ ప్రభుత్వానికి బాధితురాలు నలభైఐదుసార్లు లేఖ రాసినప్పటికీ స్పందన కరువైంది. కొద్ది రోజుల తరువాత రాయబరేలీ సమీపంలో బాధితురాలు ప్రయాణం చేస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలి ఇద్దరు సమీప బంధువులు చనిపోయారు. బాధితురాలికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరిగింది. బాధితురాలిని ఎయిర్ ఆంబులెన్స్ లో ఢిల్లీకి తరలించే అవకాశాలను పరిశీలించాలని కూడా న్యాయస్థానం కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: