కృష్ణ జిల్లా, మచిలీపట్నం పోర్టును తెలంగాణకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహస్య జీవోను జారీచేసిందని ప్రతిపక్ష టీడీపీ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షం ఆరోపణలను అధికార పార్టీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరోసారి బందరు పోర్టు అంశంపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య స్పందించారు. విజయవాడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణంపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ పోర్టు నిర్మాణంపై కేంద్రం, రాష్ట్రం పలు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాయని, కన్సార్టియంగా ఏర్పడి నిర్మాణ పనులు చేపట్టే ఆలోచన కూడా ఉందన్నారు. అలాగే కేంద్రం సాయం తీసుకోవాలా? రాష్ట్రమే చేపట్టాలా? అనేది సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్ని పేర్కొన్నారు.


బందరు (మచిలీపట్టణం) పోర్టును తెలంగాణకు ఇచ్చేసిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టుపై 40 ఏళ్ల అనుభవం ఉన్న పెద్దాయన, మంత్రిగా పనిచేసిన ఆయన కొడుకు ఏదేదో ప్రచారం చేశారని మండిపడ్డారు. రహస్య జీవోలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించిన ఆయన... ప్రభుత్వం విడుదల చేసిన జీవో 62లో ఎలాంటి రహస్యాలు లేవని, ఎవరైనా చూసుకోవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్రం ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లకుండా ప్రభుత్వం పనిచేస్తోందని, దీనిపై సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి ఉద్ఘాటించారు.


వాహనదారుల నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వీటిని నియంత్రించేందుకు 8వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ విలీనంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, ఆ సంస్థలో పనిచేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులవుతారని ఆయన చెప్పారు. జర్నలిస్టులకు కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ అమలు చేస్తున్నారని, దీనిపై కూడా అధ్యయనం చేస్తున్నామని మంత్రి వివరించారు. కాగా, బందరు, కాకినాడ పోర్టుల బాధ్యతలను ఒక్కరే చూస్తున్నారని, వాటికి వేర్వేరుగా అధికారులను నియమిస్తూ జీవోను విడుదలచేసినట్టు ఆగస్టు తొలివారంలో మీడియాకు వివరాలు వెల్లడించిన విషయం విదితమే.


ప్రతిపక్షం వారు బందరు పోర్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కాకినాడ పోర్టుకు కొత్త అధికారిని నియమిస్తూ ఇచ్చిన జీవో 62పై రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేమీ రహస్య జీవో కాదంటూ దానికి సంబంధించి ప్రతులను మంత్రి పేర్ని మీడియా ముందు బహిర్గతం చేస్తూ, ప్రతిపక్ష టి.డి.పి ను ఎండగట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: