సాధారణంగా బ్యాంకులలో ఎవరి అకౌంట్లలోనైనా నగదు జమ చేయాలంటే ఇప్పటివరకు ఖాతాదారుల అనుమతి లేకుండానే డబ్బులు జమ చేసే అవకాశం ఉండేది. కానీ ఇకముందు ఇలా చేయటం కుదరదు. ఖాతాదారుల అనుమతి ఉంటే మాత్రమే బ్యాంకులు నగదు జమ చేసుకోవటానికి అవకాశం కల్పించబోతున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులోని ఖాతాదారులు తమ ఖాతాలలో జరిగే నగదు జమ గురించి తెలిసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం బ్యాంకులలో నగదు జమ విషయంలో ఉన్న నిబంధనలలో మార్పులు రాబోతున్నాయని, నిబంధనలలో మార్పు దిశగా చర్యలు ప్రారంభించామని నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. దీనికి సంబంధించిన విధి విధానాల గురించి నిర్మాలా సీతారామన్ ఆర్బీఐ కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఎవరైనా ఖాతాలలోకి నగదు జమ చేయటానికి వస్తే ఖాతాదారునికి ఆ విషయం గురించి బ్యాంకు అధికారులు సమాచారం ఇస్తారు. 
 
ఖాతాదారుడు అనుమతిస్తేనే నగదు జమకు సంబంధించిన లావాదేవీ జరుగుతుంది. ఖాతాదారుడు తిరస్కరించిన పక్షంలో నగదు జమ చేయటానికి వీలు పడదు. నోట్ల రద్దు జరిగిన సమయంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చటానికి చాలామంది బ్యాంకు ఖాతాలను వాడుకున్నారని ఆ సమయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఖాతాదారులకు తెలియకుండానే కొందరి అకౌంట్లలో నగదు జమ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. 
 
ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో బ్యాంకులకు ఎవరైనా వెళ్ళి జమ చేసే విధానం అమలులో ఉంది. ఈ కొత్త విధానం ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులందరికీ కాదని బ్యాంకుల ద్వారా ఈ సేవను పొందాలనుకునేవారు మాత్రమే కొంత నగదు చెల్లించటం ద్వారా ఈ సేవలు పొందవచ్చని సమాచారం. త్వరలో నగదు జమ గురించి అధికారికంగా ఆదేశాలు వస్తాయని సమాచారం అందుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: