నేరస్తుల అప్పగింత బిల్లు నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రొడెమోక్రసీ సభ్యులు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉధృతంగా నిరసనలు తెలియజేస్తున్నా..  ప్రభుత్వం స్పందించకపోవడంతో  ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు ఆందోళనకారులు.


డ్రాగన్ దేశంపై హాంకాంగ్ ప్రజల ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. నేరస్తుల అప్పగింత బిల్లును చైనా ప్రభుత్వం వాయిదా వేసినా, బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్‌తో హాంకాంగ్ ప్రజలు 10వారాలుగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. హాంకాంగ్‌లో ప్రజా నిరసనలు ఇంకా ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. చైనా వైఖరిని దుయ్యబడుతూ లక్షలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నేరస్థుల అప్పగింత బిల్లును పూర్తిగా ఉపసంహరించాలని హాంకాంగ్‌ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రొటెస్టర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం యుధ్ధ శకటాల వంటి వాహనాలను అందుబాటులో ఉంచింది. అటు హాంకాంగ్ వాసులకు మద్దతుగా అమెరికా ప్రకటనలు చేయడాన్ని చైనా దుయ్యబడుతోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది. 


ఆందోళనకారులను చెదరగొట్టేందుకు విద్యుత్ షాక్ లు ఇచ్చే పొడవాటి ఫోర్క్ లను వాడేందుకు చైనా సైనికులకు, పోలీసులకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలను చైనా పత్రికలు ఫొటోలుగా ఇప్పటికే ప్రచురించాయి. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. అసలే చైనా- యుఎస్ మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోంది. తమ దేశ ఉత్పత్తులపై చైనా విపరీతంగా సుంకాలు పెంచడం పట్ల అమెరికా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో హాంకాంగ్ వాసుల ఆందోళనను సాకుగా చూపి అమెరికా.. చైనా మీద అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అయితే.. చైనా సైతం తామూ వెనక్కి తగ్గేదిలేదని అమెరికాకు వార్నింగ్స్ ఇస్తుండడంతో.. ఇది రెండు దేశాల మధ్య మరింత అగ్గి  రాజుకునేందుకు దారి తీస్తుందేమోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటు హాంకాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనకారులకు వ్యతిరేకంగా చైనా మీడియాలో ఓ వీడియో హోరెత్తుతోంది. హాంకాంగ్‌ ప్రజల ఆందోళనలను హేళన చేస్తూ.. ప్రొ డెమొక్రసీ సభ్యులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ.. సీడీ రేవ్ అనే బ్యాండ్‌ రూపొందించిన ర్యాప్ వీడియో ఇప్పుడు చైనాలో వైరల్‌గా మారింది.


హే డెమోక్రసీ అంటూ సాగే  వీడియోలో మిలియన్ల మంది హాంకాంగ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి.. చైనా పాలనను వ్యతిరేకించడాన్ని చూపిస్తూ.. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, వారు విదేశీ ఏజెంట్లుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించింది చైనా. నిబంధనలకు విరుద్ధంగా హాంకాంగ్ అసెంబ్లీలోకి నిరసనకారులు చొరబడ్డారని చైనా దేశభక్త ర్యాప్‌ గ్రూప్‌ అయిన సీడీ రేవ్‌ ఈ వీడియోలో పేర్కొంది. హాంకాంగ్ చైనాలో భాగమేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో జోడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: