జమ్ము కాశ్మీర్ అంశంపై దూకుడు మీద ఉన్న బీజేపీ, తర్వాతి లక్ష్యం రిజర్వేషన్లపై పెట్టిందా ? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునివ్వగా, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించే చట్టాలకు మోడీ సర్కార్ ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. 


మంచి వాతావరణంలో రిజర్వేషన్ల అంశంపై చర్చ జరగాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చర్చ జరిగితే మంచిదని ఆయన పిలుపు నిచ్చారు. దాంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వెనక మర్మం ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ప్రజానుకూలమైన చట్టాలకు తూట్లు పోడవటమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. సామాజిక న్యాయంపై బీజేపీ టార్గెట్ చేసిందని ఓ స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఉద్దేశ్యమేమో పైమెట్టులోనూ.. ఆలోచనలు భయానకంగా ఉన్నాయని విమర్శించారు.  మీరు ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తారా అని దేశవాసులను ట్వీట్ ద్వారా ప్రశ్నించారు ప్రియాంక.  


రిజర్వేషన్ల అంశంలో బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.  రిజర్వేషన్లను  రద్దు చేయాలనే కుట్రలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. రిజర్వేషన్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు వివాదస్పదం కావడాన్ని కాంగ్రెస్ అనవసర రాద్దాంతంగా పేర్కొంది. సున్నితమైన రిజర్వేషన్ అంశంతో సహా అన్ని సమస్యలపైనా సుహృద్భావ వాతావరణంలో చర్చ జరగాలని, అందరు తమ అభిప్రాయాలు వ్యక్తపర్చాలన్నదే తమ అభిమతం అని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది.


మొత్తానికి ప్రియాంకా గాంధీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రజలకే వదిలేస్తూ ట్వీట్ చేశారు. ప్రజాభిప్రాయానికి పెద్ద పీఠవేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ వర్గాలకు సంతృప్తినిస్తోంది. బీజేపీ ఆమె చేసే విమర్శలు సొంత పార్టీకి హస్తం నేతల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కానిగా ఆమె ఉంటారనే భావన వ్యక్తమవుతోంది.    





మరింత సమాచారం తెలుసుకోండి: