ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉన్నట్టే దానిని వివిధ రూపాల్లో తెలిపే హక్కు ఉంది. అలాంటి సంఘటనే  హైదరాబాద్ లో జరిగింది. సీఎం కేసీఆర్ తో పాటు పలువురికి పోస్టులో వచ్చిన 60 పెట్టెల్లోని సీసాలు, అందులోని ద్రావణం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. పోలీసులు వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. అందులో ఉన్నది మురుగు నీరేనని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పలువురిని విచారిస్తున్నారు.

 


ఈ నెల 17న ఓయూ పోస్టాఫీసు నుంచి సికింద్రాబాద్‌ పోస్టాఫీసుకు పోస్టయిన ఈ పెట్టెలపై ఉన్న చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఇవన్నీ సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌, కేటీఆర్‌, కవిత, డీజీపీ.. పేర్ల మీద ఉన్నాయి. పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని చూసి పోలీసులూ విస్తుపోయారు. ఒకేలా ఉన్న 60 పెట్టెలు, వాటి నుంచి వస్తున్న విపరీతమైన దుర్వాసనతో ఇవేమన్నా విష రసాయనాలా.. బాంబు దాడులకు సంబంధించిన రసాయానమా.. అని అనుమానించారు. ఒక్కో సీసాలో లీటరున్నర వరకూ ద్రావణం ఉంది. పోలీసులు ఆ ద్రావణాన్ని ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ టెస్టుల్లో అది మురికి నీరేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓయూ పరిధిలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఉంది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే పలువురు ఈ తరహా నిరసనకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. విద్యార్థులెవరైనా ఇలా చేసారేమోనని కూడా అనుమానిస్తున్నారు.

 


తపాలాశాఖ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడతామని మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ జైపాల్‌రెడ్డి చెప్పారు. పెట్టెల్లో సీసాలతోపాటు పోలీసులకు లేఖలు కూడా లభ్యమయ్యాయి. లేఖలు స్పష్టంగా లేవని ‘ఇటువంటి కలుషిత నీళ్లు తాగుతున్నాం..’ అని తెలియజేయటమే వారి ఉద్దేశమై ఉంటుందని పోలీసులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: