వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఇళ్ళకు ఒకరు చొప్పున గ్రామ, వార్డ్ వాలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఆగష్ట్ 15 వ తేదీ నుండి గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధుల్లోకి చేరారు. ప్రస్తుతం 50 కుటుంబాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందించాలని గ్రామ, వార్డ్ వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ గ్రామ, వార్డ్ వాలంటీర్లు చేయాల్సిన పనులకు ప్రభుత్వం నుండి నిధుల సమస్యలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. 
 
కర్నూల్ జిల్లాలో 19 వేల మందికి పైగా గ్రామ, వార్డ్ వాలంటీర్లు విధుల్లో చేరారు. వీరందరూ ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. 16వ తేదీ నుండి గ్రామ వాలంటీర్లకు ప్రాథమిక సమాచారం సేకరించాలని బాధ్యతలు ఇచ్చారు. 25వ తేదీలోపు గ్రామ, వార్డ్ వాలంటీర్లకు కేటాయించిన 50 ఇళ్ళకు వెళ్ళి ప్రాథమిక సమాచారం సేకరించాల్సి ఉంటుంది. ప్రాథమిక సమాచారం కోసం గ్రామ వాలంటీర్లకు 13 పేజీలతో కూడిన ఒక బుక్ లెట్ ఇచ్చారు. 
 
ఈ 13 పేజీల బుక్ లెట్ లో గ్రామ వాలంటీర్లు కుటుంబానికి సంబంధించిన పథకాలు మరియు ఇతర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక బుక్ లెట్ మాత్రమే ఇవ్వటంతో 50 కుటుంబాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలంటే బుక్ లెట్ జిరాక్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. 50 కుటుంబాల వివరాలకు సరిపడే బుక్ లెట్స్ జిరాక్స్ చేయించాలంటే ఒక్క వాలంటీరుకు 1000 రుపాయల వరకు ఖర్చు అవుతుంది. 
 
వాలంటీర్లు బుక్ లెట్స్ జిరాక్స్ చేయించినా జిరాక్స్ చేయించిన డబ్బులు ఎవరిస్తారనే విషయం గురించి స్పష్టత లేదు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల బుక్ లెట్ జిరాక్స్ కు అయ్యే ఖర్చుకు బడ్జెట్ కేటాయిస్తామని పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే కర్నూల్ జిల్లా అధికారులకు తెలిపారు. ఎంపీడీవోలకు బుక్ లెట్స్ జిరాక్స్ తీయించాలని చెప్పినా అధికారులు నిర్లక్ష్యం వహించటంతో వాలంటీర్లు ప్రాథమిక సమాచారం సేకరించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తుంది. 
 
 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: