ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబ‌డులు ఇప్పించేందుకు నిబంద‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌ల్లో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రాన్ని సీబీఐ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రం కీల‌క పాత్ర పోషించారని అనుమానాలు ఉన్నాయి. కాగా, చిదంబ‌రం అరెస్టుపై ఆయ‌న కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబ‌రం స్పందించారు. త‌న తండ్రి చిదంబ‌రం అరెస్టును ఓ రియాల్టీ షోతో పోల్చారు. ప్ర‌భుత్వం ఇటువంటి డ్రామా ఆడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో విచార‌ణ జ‌ర‌గ‌లేద‌ని, కేసు ఇంకా ఎఫ్ఐఆర్ ద‌శ‌లోనే ఉంద‌ని, త‌న తండ్రి ప్ర‌తిసారి స‌మ‌న్ల‌కు హాజ‌రైన‌ట్లు కార్తీ చెప్పారు.


చెన్నైలో మీడియాతో మాట్లాడిన కార్తి చిదంబ‌రం ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అంశం నుంచి అంద‌ర్నీ ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు త‌న తండ్రిని అరెస్టు చేసిన‌ట్లు కార్తీ ఆరోపించారు. ఇది రాజ‌కీయ క‌క్ష‌తో చేసిన‌ ప‌ని అని అన్నారు. 2008 జ‌రిగిన సంఘ‌ట‌న‌కు 2017లో ఎఫ్ఐఆర్ న‌మోదు చేశార‌ని, నాలుగు సార్లు త‌న ఇంటిపై సోదాలు చేశార‌ని, 20 సార్లు స‌మన్లు జారీ చేశార‌ని, స‌మ‌న్లు జారీ చేసిన ప్ర‌తిసారి క‌నీసం ప‌ది గంట‌ల పాటు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యానని, 11 రోజుల పాటు సీబీఐ త‌న‌ను విచారించింద‌ని, త‌న‌కు సంబంధం ఉన్న ప్ర‌తివారినీ ప్ర‌శ్న‌ల‌తో వేధించార‌ని, కానీ ఈ కేసులో ఇంత వ‌ర‌కు చార్జ్‌షీట్ దాఖ‌లు కాలేద‌ని, అస‌లు ఇందులో కేసే లేద‌ని, ఐఎన్ఎక్స్ మీడియాతో త‌న‌కు ఎటువంటి లింకు లేద‌ని కార్తీ చిదంబ‌రం అన్నారు. 


ఐఎన్‌ఎక్స్ మీడియా విదేశీ అక్రమ లావాదేవీలను కప్పిపుచ్చేందుకు నాడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి చిదంబరం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కార్తీ చిదంబరం ఐఎన్‌ఎక్స్‌కు అనుచిత లబ్ధి చేకూర్చారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఇందుకుగాను ఐఎన్‌ఎక్స్ నుంచి కార్తీ ముడుపులు అందుకున్నారని పేర్కొంటున్నాయి. మారిషస్‌కు చెందిన మూడు కంపెనీల నుంచి రూ.4.62 కోట్ల ఎఫ్‌డీఐలు అందుకునేందుకు 2007 మార్చిలో ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌పీఐబీ) అనుమతినిచ్చింది. తన అనుబంధ సంస్థ ఐఎన్‌ఎక్స్ న్యూస్ లిమిటెడ్‌లో డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఐఎన్‌ఎక్స్ చేసిన ప్రతిపాదనకు మాత్రం నిరాకరించింది. షేర్ల సబ్‌స్క్రిప్షన్, అక్విజిషన్ ద్వారా ఒక భారత కంపెనీ మరో కంపెనీలో పరోక్షంగా విదేశీ పెట్టుబడులు పెట్టడాన్ని డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. కాగా, అనుమతినిచ్చిన రూ.4.62 కోట్ల ఎఫ్‌డీఐలకు బదులుగా ఐఎన్‌ఎక్స్ మీడియా సుమారు రూ.305 కోట్ల మేర ఎఫ్‌డీఐలను సేకరించిందని, నిబంధనలను ఉల్లంఘించి డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు పాల్పడిందని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: