ఇప్పటి వరకు మనం ఇష్టం వచ్చినట్టుగా వాహనాలను నడిపేవాళ్ళం.  జరిమానా అంటే లెక్కలేకుండా పోయింది.  మహా అయితే వంద లేదంటే రెండొందలు.. లేదా లంచం ఇస్తే పనిపూర్తవుతుంది.  లైసెన్స్ లేకుండా వాహనం నడపొచ్చు.. హెల్మెట్ లేకున్నా పర్వాలేదు.. ఓవర్ లోడ్ తో వాహనాలు పరుగులు తీయొచ్చు.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవచ్చు.  ఎవరు అడుగుతారు.. ఎవరు పట్టించుకుంటారు.. అంతా నా ఇష్టం అన్నట్టుగా జరిగింది ఇప్పటి వరకు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు.  


కేంద్రం వాహన చట్టంలో సవరణలు చేసింది.  ఆలా చేసిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.  ఇంకేముంది.. ఎవరైనా సరే.. కొత్త చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే.  నిర్ణయాలు కఠినంగా ఉన్నాయి.. ఫైన్ కఠినంగా ఉంటుంది.  ఎలా అంటే.. అచ్చంగా భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిల్ రూల్స్ విషయంలో మహేష్ బాబు ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అలా ఉండబోతున్నాయి.  


అర్ధంకాలేదు కదా.. వివరంగా తెలుసుకుందాం.  మాములుగా ఇప్పటి వరకు అధిక లోడ్ తో ప్రయాణం చేసే వాహనాలకు ఫైన్ కింద 2వేలు వేసేవారు.  అలానే ప్రతిఅదనపు టన్నుకు వెయ్యి ఫైన్ పడేది.  ఇప్పుడు అలా కాదు.  ఈ ఫైన్ మరింత పెరిగింది.  అధిక లోడ్ తో ప్రయాణం చేస్తే.. ఫైన్ 20వేలు.. ప్రతి అదనపు టన్నుకు రెండువేలు ఫైన్.. బాప్ రే అని షాక్ అవ్వకండి.. ఇంకా చాలా ఉన్నాయి.  


పరిమితికి మించి ఆటోల్లో, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుంటారు.. వారి విషయంలోనూ జరిమానాను భారీగా ఉన్నాయి.  అధికసంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటే.. ఒక్కో అదనపు ప్రయాణికుడికి వెయ్యి చొప్పున ఫైన్ వేస్తారు.. అలాగే టూ వీలర్ పై అధికబరువు తీసుకెళ్తే.. ఫైన్ వెయ్యి దాంతోపాటు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక్కడితో సరి అని సరిపెట్టుకోకండి.  


హెల్మెట్ పెట్టుకోకుంటే వెయ్యి, మందుకొట్టి వాహనం నడిపితే పదివేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపితే ఐదువేలు, అత్యవసర వాహనాలను దారి ఇవ్వకపోతే పదివేలు ఫైన్ పడుతుంది.  సో, వాహనాలు నడిపేసమయంలో ఫైన్ కు సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని నడపాలి.  లేదంటే సంపాదించిన సంపాదన మొత్తం ఇలా ఫైన్ కట్టడానికే సరిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: