తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు ఎమ్మెల్యేల‌పై బీజేపీ వ‌ల వేసింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం రోజు రోజుకు ఎక్కువ అవ్వ‌డంతో టీఆర్ఎస్ వాళ్లు ఎదురు దాడి కూడా స్టార్ట్ చేశారు. ఇదంతా బీజేపీ ఆడుతోన్న మైండ్‌గేమ్‌లో భాగ‌మ‌ని టీఆర్ఎస్ కౌంట‌ర్ ఎటాక్ ఇస్తోంది. ఇదిలా ఉంటే కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారనే ఓ వార్త ఇప్పుడు క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు అటు టీఆర్ఎస్ వ‌ర్గాల్లోనూ తీవ్ర‌మైన ప్ర‌కంప‌న‌లు రేపింది.


ఈ వార్త బాగా వైర‌ల్ అవ్వ‌డంతో గంగుల కూడా ఎలెర్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో స‌ర్య్కులేట్ అవుతోన్న క‌థ‌నం ప్ర‌కారం బీజేపీలోకి వెళ్లే టీఆర్‌ఎస్‌ నేతల లిస్టు ఇదేనంటూ ఓ లిస్ట్ యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌మ‌లాక‌ర్ బీజేపీ అభ్య‌ర్థిగా పోటీచేసిన బండి సంజ‌య్‌పై విజ‌యం సాధించారు. ఈ యేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అదే బండి సంజ‌య్ ఎంపీగా ఘ‌న‌విజ‌యం సాధించారు.


క‌రీంన‌గ‌ర్ ప‌రిధిలో కూడా క‌మ‌లాక‌ర్‌కు షాక్ త‌గిలింది. ఆ సెగ్మెంట్ ప‌రిధిలోనూ సంజ‌య్‌కే మంచి మెజార్టీ వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ క‌మ‌లాక‌ర్ కూడా టీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రాబ‌ల్యం పెరుగుతుండ‌డంతో ఆయ‌న కూడా బీజేపీ వైపు చూస్తున్నారంటూ ప్ర‌చారం జరిగింది. ఈ ప్ర‌చారంపై సీరియ‌స్ అయిన క‌మ‌లాక‌ర్  సోష‌ల్ మీడియాలో త‌న పార్టీ మార్పుపై వ‌స్తోన్న వార్త‌ల నేప‌థ్యంలో డీజీపీకి, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 


ఈ క‌థ‌నాల వ‌ల్ల త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లుగుతోంద‌ని కూడా ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో మూడుసార్లు గెలిచిన త‌న‌ను చూసి కొన్ని అసాంఘీక శ‌క్తులు ఓర్వ‌లేక‌పోతున్నాయ‌ని... త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు కుట్ర ప‌న్నుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయ‌న పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది.  తన తుది శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉంటానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆశయాల మేరకు వారి అడుగుజాడల్లో పనిచేస్తానని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియాలో స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: