కృష్ణా వరదల నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై ఓ నిర్ణయం త్వరలో ప్రకటిస్తామంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్నే సృష్టించాయి. ఇంకేముంది.. రాజధానిని మార్చేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేశాయి. మీడియా కూడా హాట్ టాపిక్ కావడంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. వైసీపీ సర్కారు రాజధానిని దొనకొండకు మార్చే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. దాదాపు అన్ని పార్టీల నేతలు దీనిపై స్పందించారు.


ఇక ఈ వివాదం పెద్దదయ్యే అవకాశం ఉండటంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రాజధాని నగరం పేరుతో జరిగిన అక్రమాలపై, చంద్రబాబు మాయా నగరంపైనే తమ అభ్యంతరమని ఆయన ప్రకటించారు. రాజధాని నిర్మాణంపై మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ యధాలాపంగా అన్న మాటలపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయన్నారు.


రాజధాని పేరుతో సాగిన అక్రమాలన్నింటిపై దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి బుగ్గన తేల్చి చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైసీపీ సర్కారు తమ లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి నెల్లూరు వరకు అందరికీ సమాన అవకాశాలు, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దీని ద్వారా సాంఘిక అసమానతలు లేకుండా చేయడానికి వికేంద్రీకరణ ఉపయోగపడుతుందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.


రాజధాని అక్రమాలపై ఎవరి ప్రమేయమున్నా ఉపేక్షించేది లేదని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. లాండ్‌ పూలింగ్‌ పేరుతో టీడీపీ నేతలు పెద్ద వ్యాపారానికి తెరతీశారని మంత్రి విమర్శించారు. రాజధాని ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు ఎకరా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్మారని.. అదే భూమిని ప్రభుత్వ రంగ సంస్ధలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయలకు అమ్మారని మంత్రి విమర్శించారు. మొత్తానికి రాజధాని మార్చేది లేదని బుగ్గన ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తో పాటు మరోచోట మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కూడా రాజధాని మార్చేది లేదని క్లారిటీ ఇచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: