మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఈరోజు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖ జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావుకు చెందిన గెస్ట్ హౌస్ కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో గెస్ట్ హౌస్ కూల్చివేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తామని వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
అక్రమ నిర్మాణమనే కారణంతో ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేయటం జరిగింది. ఆ తరువాత అక్రమ నిర్మాణాల విషయంలో టీడీపీకి చెందిన నాయకులకు నోటీసులు కూడా వస్తున్నాయి. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు టీడీపీ నేతలకు కూడా నోటీసులు వచ్చినట్లు సమాచారం. ఈ భవనం గంటా శ్రీనివాస్ రావు కూతురు సాయి పూజిత పేరుతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా గంటా శ్రీనివాసరావు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.  
 
గంటా శ్రీనివారావు ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. పార్టీ మారతారని గంటా శ్రీనివాసరావు గురించి ప్రచారం కూడా జరిగింది. ఈ భవనం విషయంలో గతంలో గంటా శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించాడని, హైకోర్టు అక్రమ నిర్మాణాన్ని కూల్చే ముందు వారం రోజుల సమయం ఇవ్వమని చెప్పిందని సమాచారం. ఇప్పుడు ఆ గడువు ముగిసినందువల్లే అధికారులు కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలపై కక్ష్యపూరితంగా  జీవీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారని గంటా శ్రీనివాసరావు వర్గీయులు అభిప్రాయపడుతున్నారని సమాచారం. 
 
విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని జీవీఎంసీ అధికారులు దగ్గరుండి గత వారం కూల్చివేశారు.విశాఖ జిల్లాలోని ద్వారకానగర్లో పీలా గోవింద్ బహుళ అంతస్తుల భవనం నిర్మించుకోగా సరైన అనుమతులు లేవనే కారణంతో అధికారులు ఈ భవనంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గతంలో ఈ విషయం గురించి నోటీసులు జారీ చేయగా నోటీసులకు స్పందన లేకపోవటంతో గతవారం ఈ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేసినట్లు తెలుస్తుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: