కాశ్మీర్ లోయలో సైనిక విధులు ముగించుకొన్న టీమిండియా క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ సరికొత్త అవతారం ఎత్తాడు. ధోనీ, ఖద్దరు దుస్తులు ధరించి రాజకీయ నాయకుడిగా మారిపోయిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికి మహీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది.  ప్రపంచకప్ అనంతరం విండీస్ పర్యటనకు రెండు నెలలు విరామం ప్రకటించిన మహీ..


భారత సైన్యంలో చేరి కాశ్మీర్ లోయలో విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ అయిన మహీ.. 15 రోజులు లెహ్‌లో విధులు నిర్వర్తించాడు. అనంతరం విధుల నుండి ఇంటికి తిరుగుపయనమైన ధోనీ.. ఆపై ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం ముంబై వెళ్లాడు.ఇదిలావుంటే.. యాడ్‌ షూటింగ్‌లో భాగంగా మహీ ఖద్దరు దుస్తులు ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం ఒక హోర్డింగ్ ఫై మహీ రాజకీయ నాయకుడిగా దర్శనమిచ్చాడు.


ఇది చూసిన అభిమానులు ఆ పోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. అసలే ధోనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలలో తమ అభిమాన ఆటగాడిని చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే.. నిజజీవితంలో ఎంతో సాధారణంగా వుండే ధోనీ.. కాశ్మీర్ లో కూడా ఒక  సాధారణ సైనికుడిగా గడిపాడు. అంతేకాదు అక్కడి సైన్యంతో వాలీ బాల్ ఆడడం, పాటలు పాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి చేసాడు. తన అనుభవాలను అక్కడి రెజిమెంట్‌ సభ్యులతో పంచుకున్నాడు. అలాగే కాశ్మీర్ లాంటి ప్రదేశంలో సైనికుల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: