ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష జ‌న‌సేన సాగుతున్న మాట‌ల యుద్ధం ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కునే స్థాయికి చేరింది. ఏకంగా పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేసే వ‌ర‌కు చేరింది. తాజాగా అధికార వైసీపీ విష‌యంలో జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ కళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జనసేన పార్టీపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తోంద‌ని పేర్కొంటూ సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌నున్నారు.


రెండు పార్టీల మ‌ధ్య వివాదానికి సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ‘జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్ పుట్టిన‌రోజు నేప‌థ్యంలో దాదాపు రూ.2000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీని మార్చేందుకు అమరావతిలో తానా వర్గం ఉన్నట్లు సమాచారం. అందుకే పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీ కలిపి వాటిని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేసినట్టు ఇప్పటికే కొంతమంది పవన్ అభిమానులు గుర్తించి తీవ్ర నిరాశతో ఉన్నారు’అని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది. దీనిపై ఇప్ప‌టికే జ‌న‌సేన సోష‌ల్ మీడియా విభాగ‌మైన శ‌త‌ఘ్ని స్పందించింది. ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది.


దీనికి కొన‌సాగింపుగా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లీగల్ నోటీసులు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. జ‌న‌సేన పార్టీపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని పార్టీ వర్గాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన నేప‌థ్యంలో...పార్టీ నేత‌లు సైబ‌ర్ క్రైం వ‌ర్గాల‌ను క‌లిసి ఈ మేర‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను జనసేన పార్టీ ప్రతినిధులు ఈ రోజు క‌లిసి ఈ మేర‌కు విన‌తిప‌త్రం అందించ‌నున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: