ఏపీలో రాజధాని రగడ తారస్థాయికి చేరింది. రాజధాని ఎక్కడ అనే దానిపై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం పొలిటికల్ హీట్ ను పెంచుతుంది. రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని కొందరు, కాదు తిరుపతిలోనే ఉండాలంటూ మరికొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాజధాని ఎక్కడ అన్న అంశం ఏపీ ప్రజల ముందు మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. ఏపీ రాజధాని ఎక్కడ, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదా, ఏపీ రాజధాని కర్నూలుకు మారుతోందా, ఏడుకొండల సాక్షిగా తిరుపతిని రాజధానిగా మారుస్తారా, దొనకొండను ఏపీ రాజధానిగా ప్రకటిస్తారా, ఇప్పుడిదే రాష్ట్ర ప్రజలనే కాదు, రాజకీయ పార్టీల నేతలను తికమకపెడుతున్న పెద్ద ప్రశ్న.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతోందన్న వార్తలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. దీంతో రాజధానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కర్నూలు లేదంటే తిరుపతిని ఏపీకి రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాదు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని దొనకొండలో ఏర్పాటు చెయ్యాలని కోస్తా నేతలు పట్టుబడుతున్నారు. మరికొందరేమో ప్రస్తుతమున్న అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీ రాజధాని ఎక్కడనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కర్నూలును ఏపీ రాజధానిగా ప్రకటించాలని సీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


కర్నూల్ ఐతే అన్ని విధాలుగా బావుంటుందని కాటసాని రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తును ఊహించి అమరావతినే ఏపీ రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని టిడిపి నేతలు వాదిస్తున్నారు. అన్ని హంగులు అక్కడున్న కారణంగానే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ అంటున్నారు. అమరావతిపై ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చని వైసిపి, ఇప్పుడెందుకు రాద్దాంతం చేస్తోందంటూ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అమరావతి కాదనుకుంటే రాజధానిగా తిరుపతినే ఎంపిక చేస్తే అన్ని విధాలుగా బావుంటుందని చింతా బోహన్ డిమాండ్ చేస్తున్నారు.

అయితే రాజధాని మార్పుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. మరోవైపు ఏపీ రాజదానిగా దొనకొండను ఏర్పాటుచెయ్యాలనీ ప్రకాశం జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అంశం చర్చకు రావటంతో దొనకొండలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు పాతిక ముప్పై లక్షల రూపాయలు ఉన్న ఎకరం పొలం, ఒక్కసారిగా కోటి రూపాయలకు పెరిగింది. ఎక్కడ చూసిన వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ లు వెలుస్తున్నాయి. మొత్తానికీ ఏపీ రాజధాని రగడ రాష్ట్రంలో  కాక రేపుతోంది. ఓ వైపు పొలిటికల్ వార్ కొనసాగుతుంటే, మరోవైపు సామాన్య ప్రజల్లో కూడా రాజధాని ఎక్కడన్న అంశంపై ఆందోళన కొనసాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: