ప్ర‌భుత్వ అధికారుల్లోని కొంద‌రి అవినీతి భాగోతంలో మ‌రో ఉదంతం బ‌య‌ట‌ప‌డింది. దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ గోల్‌మాల్ జ‌రిగింది. రూ. 4 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు వ‌చ్చాయి. నిధుల గోల్‌మాల్, అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు జ‌రుపుతోంది. అయితే, ఈ విచార‌ణ‌లో ఉన్న‌తాధికారులు జోక్యం చేసుకోగా....రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి ఫిర్యాదు రావ‌డం, ఆయ‌న నిజాలు నిగ్గుతేల్చాల‌ని ఆదేశించ‌డంతో...అస‌లు దోషుల‌ను తేల్చే ప్ర‌క్రియ సాగుతోంది.


అన్ని దేవాల‌యాల వ‌లే దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్ర‌తిరోజూ పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు. అయితే, ఈ పూజ‌ల ఆధారంగానే కొంద‌రు అధికారులు డ‌బ్బులు దండుకునే దందాకు తెర‌తీశారు. వెంకటేశ్వర స్వామి రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్ల నుంచి అధికారులు ముడుపులు తీసుకున్నారు. కేవ‌లం రోజువారీ కార్య‌క్ర‌మాల్లోనే కాకుండా ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలకు పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఓ భ‌క్తు ఆధారాలతో సహా టీటీడీకి ఫిర్యాదు చేశాడు. భ‌క్తుడి ఫిర్యాదుతో తొలుత టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణ నిర్వ‌హించారు. అయితే, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యంతో విచారణ నిలిచినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


అయితే, టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డికి స‌ద‌రు భక్తుడు ఫిర్యాదు చేశారు. దీంతో అవకతవకలు నిగ్గు తేల్చాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి రాష్ట్ర ప్రభుత్వం బాధ్య‌త‌లు అప్పగించింది. రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండ్రోజులుగా ఢిల్లీలోని ఏఈఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: