కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదు, మిత్ర పక్షం  కాదు కదా, అంతకు మించి శత్రు పక్షం. నిన్నటివరకూ తిట్టిన తిట్టు తిట్టకుండా మోడీని, అమిత్ షాని తిట్టిన పాపానికి ఎంతకైన తెగించే వీలున్న బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. ఇక్కడ చూస్తే దారుణాతి దారుణంగా ఓడిపోయిన టీడీపీ కనీ కనిపించని స్థితిలో విపక్షంలో ఉంది. ఇక బంపర్ మెజార్టీతో గెలిచిన వైసీపీ అధికారంలో ఉంది. చూసుకుంటే అంతా కాని కాలమే. అంతా చేటు కాలమే.


కానీ టీడీపీ చక్రం బాగానే తిరుగుతోంది. అలా ఇలా కాదు, గతంలో మిత్ర పక్షంగా ఉన్నప్పటికన్నా స్పీడ్ గానే ఢిల్లీలో తిరుగుతోంది. దాని వల్లనే ఏపీలో జగన్ కి తలనొప్పులు, తల బొప్పులు తెప్పించేస్తోంది పసుపు శిబిరం. బాబు కుడి భుజం సుజనా చౌదరి బీజేపీకి చేరడంతోనే కమలంతో దోస్తీ బాగా పెరిగింది. అఖరుకు  కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారి భాష కూడా పచ్చ పార్టీ భాషగా మరింది. కన్నాను జగన్ కి అద్దె మైకు అని గతంలో అన్న టీడీపీ మాటలను  ఆయన ఇపుడు అసలు పట్టించుకోవడంలేదు. టీడీపీకి జిగినీ దోస్తుగా మారిపోయారు. జగన్ ఆయనకు  ఆగర్భశత్రువైపోయారు.


ఇక కేంద్రంలో జలవనరుల శాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పూర్తిగా టీడీపీ దారిలోనే వున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన మీద మాజీ కేంద్ర మంత్రి, మాజీ టీడీపీ నేత సుజనా చౌదరి ప్రభావం ఉందన్న ప్రచారం నిజమేననిపిస్తోందంట. గజేంద్రసింగ్ ఈ రోజు మాట్లాడుతూ కేంద్రం తన పని తాను చేసుకునిపోతుందని అన్నారు.  సమాఖ్య వ్యవస్థలో ఎవరికి ఎవరి ఆశీర్వాదాలు ఉండవని ఆయన అంటున్నారు. కేంద్రం పని కేంద్రం చేయాలని, రాష్ట్రం పని రాష్ట్రం చేయాలని ఆయన అన్నారు.


ఓ విధంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చురకగా ఈ మాట వాడివుంటారని అంటున్నారు. మోడీ, షాల అనుమతితోనే ఏపీలో ప్రతి పని చేస్తున్నామని రెండు రోజుల క్రితమే విజయసాయి అన్నారు. మరో వైపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీలో ఫ్రెండ్లీ సర్కార్ ఉందని అంటే గజేంద్ర సింగ్ మాత్రం వేరే విధంగా మాట్లాడడం ఆశ్చర్యమే.


అంటే ఎక్కడ ఎవరిని పట్టాలో అక్కడ పట్టేసి తన మాజీ తమ్ముడి ద్వారా టీడీపీ కధ నడిపిస్తోందన్న మాట. మొత్తానికి ఎటువంటి అధికారం లేకపోయినా టీడీపీ రింగ్ బాగానే తిప్పుతోంది. గజేంద్ర సింగ్ షెకావత్ వరసగా జగన్ సర్కార్ కి ఇలా షాకులు ఇస్తూంటే ఆనందించడం టీడీపీ వంతు అవుతోంది. చూడాలి ఈ జోరు ఎంతవరకూ సాగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: