కష్టాలు ఏమొచ్చినా..ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని ఎంతో మంది కవులు, కళాకారులు చెబుతుంటారు.  వారు రాసే పుస్తకాలు, సినిమాలు చూసి గుండె ధైర్యం తెచ్చకున్న వాళ్లు ఉన్నారు. అలాంటి ఓ మహిళా రచయిత ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. ఆమె భర్త రామతీర్థ సాహితీలోకానికి మంచి పరిచయం ఉన్న వ్యక్తి. ఇటీవల కాలంలో ఆయన మరణించిన తర్వాత జగద్ధాత్రి మానసికంగా కృంగిపోయారు.

భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. అయితే కొద్ది రోజులుగా జగద్ధాత్రి ఒంటరిగా కూర్చొని ఆలోచించడం..బాధపడటం చేస్తున్నారట. ఒంటరితనం కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాసినట్లు సమాచారం.  తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని మరో లేఖలో ఆమె రాసినట్లు చెబుతున్నారు.  ఈ రెండు లేఖలను కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

  అలాగే తన వద్ద ఉన్న వస్తువులు అన్నీ రాజేష్ అనే వ్యక్తికి ఇవ్వాల్సిందిగా ఆమె లేఖలో పేర్కొన్నారు. దానికి కారణం గత కొంత కాలంగా ఆమెకు చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే రాజేష్ కి తనకు ఉన్నది ఇస్తున్నానని పేర్కొంది. జగద్దాత్రి కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. అనువాదాలు కూడా చేశారు. కావ్య జ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు.  మొజాయిక్ లిటరరీ అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించారు.

గతంలో ఆమె లెక్చెరర్ గా పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆమె రచనలు చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆమె వెంకోజీపాలెం నుంచి ఎంపివీ కాలనీకి తన నివాసాన్ని మార్చారు.వక్షస్థలే అనే కథకు ఆమె ఆర్ఎస్ కృష్ణమూర్తి అవార్డును అందుకున్నారు. ఆమె మృతికి తెలుగు సాహిత్య లోకం నివ్వెరపోయింది. సోషల్ మీడియాలో తెలుగు సాహిత్యకారులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: