గత వారం రోజులుగా రాజధాని అమరావతి విషయంలో రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వరదలు వచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు తగ్గట్టుగా మంత్రి సత్యనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటనలు రాజధాని విషయంలో ప్రజలని అయోమయంలో పడేశాయి. వరద ముంపు ఉంది కాబట్టి రాజధాని నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని, మార్పు విషయంమై ఆలోచిస్తున్నామని మంత్రి ప్రకటన చేశారు.


దీనిపై స్పందించిన టీడీపీ, బీజేపీలు బొత్స వ్యాఖ్యలని ఖండించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఇక రాజధాని మారుతుందని వార్తలు రావడం అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేశాయి. దీనిపై వారు ఆందోళన చెందుతున్నారు. సీఎం త్వరగా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాజధాని రైతులని కలసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.


రాజధాని మార్పు వార్తలపై ఆయన స్పందిస్తూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ రాజధానిగా అమరావతే సరైన ప్రాంతమని, రాజధానిని తరలిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. దీన్ని జనసేన వ్యతిరేకిస్తుందని, రాజధానిని మార్చడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని చెప్పారు. అలాగే రాజధాని కోసం తరతరాలుగా వస్తున్న భూములను రైతులు త్యాగం చేశారని తెలిపారు.  


రాజధాని కోసం కొందరు రైతులు ఇష్టంగా ఇచ్చారని, మరికొందరు అయిష్టంగా ఇచ్చారని, ఏదిఏమైనా రాష్ట్రం కోసం రైతులు త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పులు ఉంటే సరిదిద్దాలి గానీ, రద్దు చేయకూడదని అన్నారు. ఇకపోతే ఎవరెన్ని మాట్లాడినా రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటన చేసే వరకు క్లారీటీ వచ్చే అవకాశం లేదు. అంతకముందు ఆయన రాజధాని మారదని ప్రకటన చేశారు కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ రాజధాని విషయంలో గందరగోళం ఏర్పడటంతో సీఎంనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమొచ్చింది. చూద్దాం మరి జగన్ జనాల కోసం ఎలాంటి ప్రకటన చేస్తారో.        


మరింత సమాచారం తెలుసుకోండి: