ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న పాత నేతలకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతల వల్ల ఇబ్బందులు వస్తున్నాయా?పార్టీలో వారి డామినేషన్ ఎక్కువగా ఉందా? ముఖ్యంగా ఆ ఇద్దరు నేతల వల్ల మిగతా నేతల్లో అసంతృప్తి పెరిగిందా? అంటే  అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అందుకే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి రావడంతో బీజేపీ నేతలు బాగా ఆనందపడ్డారు.  తాము ఒకశాతం ఓట్లు తెచ్చుకోకపోయిన టీడీపీ ఓడిపోయిందని సంబరపడ్డారు.


పైగా కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో ఏపీలో బలపడాలని భావించిన బీజేపీ తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుని ఆపార్టీ నేతలకి కాషాయ కండువా కప్పేసారు. ఈ క్రమంలోనే నలుగురు రాజ్యసభ సభ్యులని కూడా పార్టీలోకి తీసుకుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నిదానంగా పార్టీలో టీడీపీ నుంచి వచ్చిన నేతల డామినేషన్ పెరిగింది. ముఖ్యంగా చంద్రబాబు సన్నిహితంగా ఉండే సుజనా చౌదరీ, సీఎం రమేశ్ లు ఏపీ బీజేపీపై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని బీజేపీ నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే.  కానీ ఇప్పుడు వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియా ముందుకు వచ్చేసి  సుజనా చౌదరీ విమర్శలు చేసేస్తున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి మోడీ, షా లకు చెప్పే ఏ నిర్ణయమైన తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై వెంటనే సుజనా మీడియా మీట్ పెట్టేసి విజయసాయిపై మండిపడ్డారు. పైగా కేంద్ర పెద్దలతో కూడా చెప్పి విమర్శలు చేయించారు. అలాగే రాజధాని అమరావతి విషయంలో కూడా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కంటే సుజనా వెంటనే రియాక్ట్ అయ్యారు.


దీంతో ఈ విధంగా వీరు పార్టీలో డామినేట్ చేయడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఎక్కువ అసంతృప్తిగా ఉన్నారు. అటు సీనియర్ నేతలు పురంధేశ్వరీ, కంభంపాటి హరిబాబు, మాణిక్యలరావు, సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వారు కూడా సుజనా, సీఎం రమేశ్ వైఖరి పట్ల ఆగ్రహంగా ఉన్నారు. పైగా వీరు టీడీపీ నేతల్లానే ప్రవర్తిస్తున్నారని వారు పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఎలా అయిన పార్టీ అధిష్టానంతో చెప్పి వీరికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు ఏపీ బీజేపీలో మంటలు రేపుతున్నారు. మరి ఈ మంటలు ఎలా చల్లారుతాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: