అనారోగ్యం కారణంగా బీజేపీ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఇక ఆయన పార్థివదేహాన్ని ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు.ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఆయన పార్థివదేహాన్ని,రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు.సుదీర్ఘమైన తన ప్రయాణంలో అలుపెరుగని నేతగా పేరు తెచ్చుకుని,పలు కీలక పదవులను అధిష్టించి,ఎందరో అభిమానం చూరగొన్న జైట్లీని చివరిసారిగా చూడటానికి వచ్చే పార్టీనేతలు,కార్యకర్తలు,అభిమానుల సందర్శనార్ధం పార్థివదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు.అయితే జైట్లీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరుకాలేకపోవచ్చని సమాచారం.



ఎందుకంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ,బహ్రెయిన్ వెళ్లిన ఆయన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రేపు అక్కడే ఉండాలి.కానీ జైట్లీ మృతితో ఆయన తన పర్యటన కొనసాగిస్తారా లేక తిరిగి వస్తారా అనే చర్చ సాగింది.అయితే జైట్లీ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులకు మోదీ ఫోన్ చేసి ఓదార్చుతూ ధైర్యం చెప్పారట.వెంటనే నేను ఢిల్లీ వస్తానని తెలుపగా జైట్లీ కుటుంబ సభ్యులు పర్యటన రద్దు చేసుకొని రావద్దని దేశం కోసం వెళ్ళిన పని పూర్తి చేసుకోవాల్సిందిగా మోదీని  కోరినట్టు తెలుస్తోంది..



ఇక అరుణ్ జైట్లీ మృతి చెందిన నేపథ్యంలో టీం ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.అరుణ్ జైట్లీ మృతికి సంతాపంగా వెస్టిండీస్‌తో ఈరోజు ఆడే మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు.అరుణ్ జైట్లీ గతంలో ఢిల్లీ,డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ (డీడీసీఏ)కు అధ్యక్షత వహించడమే కాకుండా,బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన తన సేవలందించారు.అరుణ్ ‌జైట్లీ సేవలను గుర్తు చేసుకుంటూ నేడు వెస్టీండీస్‌తో జరిగే మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్లు ధరించాలని టీం ఇండియా నిర్ణయం తీసుకుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: