ఈ జమ్మూకశ్మీర్ అల్లుడు న్యాయ కోవిదుడు. విద్యార్థి దశ నుంచే నాయకుడు. దిల్లీలో చదువుకుంటున్న కాలంలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న అరుణ్ జైట్లీ అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో కీలక నేతగా ఎదిగారు. 2000 సంవత్సరం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ 1999 నుంచి పలు మార్లు భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు 2000 నుంచి 2018 వరకు గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
నరేంద్ర మోదీ గత ప్రభుత్వంలో ఆయన వేర్వేరు మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2014 నుంచి 2016 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా.. 2014 - 17 మధ్య మోదీ ప్రభుత్వంలోనే రక్షణ మంత్రిగా, 2014 - 19 కాలంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రిగానూ పని చేశారు.



అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పనిచేసిన ఆయన అప్పట్లో సమాచార ప్రసార (స్వతంత్ర), వాణిజ్య, న్యాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. అలాంటి శాఖ ఏర్పాటుచేయడం అదే తొలిసారి. ఆ శాఖకు తొలిమంత్రి జైట్లీనే. రాజ్యసభలో బీజేపీ సభాపక్ష నేతగానూ పనిచేసిన ఆయన 2002 నుంచి మరింత క్రియాశీలంగా మారి భారతీయ జనతా పార్టీకి వ్యూహకర్తగానూ సేవలందించారు. హిందుత్వ భావజాలం ఉండే బీజేపీలో లిబరల్ ఫేస్ ఉన్న అతికొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు అని రాజకీయవర్గాల్లో అనుకుంటూ ఉంటారు.
 



కేంద్ర మాజీమంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న తరుణంలో మనకు దూరం కావడం దురదృష్టకరం. కేంద్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా,ప్రధాన ప్రతిపక్ష నేతగా చేసిన సేవలు చిరస్మరణీయం. వాజ్ పేయి, నరేంద్రమోడి మంత్రివర్గాలలో న్యాయ సంస్కరణలు, ఆర్ధిక సంస్కరణల కోసం కృషి చేశారు. విద్యార్ధి సంఘం అధ్యక్షునిగా ప్రారంభమైన జైట్లీ రాజకీయ జీవితం ఎంపిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రముఖ న్యాయకోవిదునిగానే కాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరొందారు. 
ఆయన మృతి బిజెపికే కాకుండా మొత్తం దేశానికే  తీరనిలోటు. అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి.  
భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్ననని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: