ఆమెలేని సాహిత్య కార్యక్రమం విశాఖలో జరగదు. కొన్ని వందల వేల సాహిత్య సభల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె ఎందరికో స్పూర్తి. ఆమె బహుముఖీయమైన ప్రతిభావంతురాలు. ఓ వైపు సాహిత్యం పట్ల ఆసక్తి సనంగిల్లుతున్న  నేపధ్యంలో ఎందరో యువకవులను తయారు చేసే కర్మాగారంలా ఆమె చేసిన సేవ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మహిళలకు ఆమె రోల్ మోడల్ అంటే అతిశయోక్తి కాదు.


ఆమె ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యురాలు జగద్ధాత్రి. ఆమె నిన్న అనూహ్యంగా విశాఖలోని ఎంవీపీకాలనీలోని తన ఇంట్లో  ఆత్మహత్య చేసుకున్నారు.  ఉరివేసుకుని బలవన్మరణానికి  పాల్పడ్డారు. గతంలో లెక్చరర్‌గా ఆమె పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో జగద్ధాత్రి పలు రచనలు చేశారు. కవితలు రాశారు. అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు.


ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం   ప్రముఖ రచయిత, ఆమెకు బాగా సన్నిహితుడు అయిన రామతీర్థ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు తెలుస్తోంది. మానసిక క్షోభతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు. ఆమె ఆత్మహత్య వార్త విన్న విశాఖ సాహితీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె ధైర్యం ఎవరికీ లేదని, అటువంటిది ఆమెను పిరికితనం ఎలా ఆవహించిందని అంతా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఇవాళా రేపూ మహిళలు బయటకు వచ్చినా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.


అటువంటి మహిళలకు గుండె నిండా ధైర్యం నూరిపోసే జగధ్ధాత్రి ఇలా అందరినీ వదిలి వెళ్ళిపోవడం, అదీ ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ బాధపడుతున్నారు. జగద్ధాత్రి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తోటి కవులతో స్నేహంగా ఉండేవారు. ఆమె మృతి పట్ల సాహిత్యలోకం, సోషల్‌ మీడియాలో సంతాపాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆమె ఆత్మహత్య పట్ల  సంతాపం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: