ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కృష్ణానదికి ప్రవాహం వచ్చి జలాశయాలు అన్నీ నిండితే ఆ సంతోషం చంద్రబాబు ముఖంలో కనిపించడం లేదని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. ఎంతసేపూ తన ఇల్లు మునిగిపోయిందనే బాధ తప్ప.. వేరే విషయాలు చంద్రబాబు పట్టడం లేదని అనిల్ విమర్శించారు.


దేవుడి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనూ ప్రకృతి సహకరించి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్టుకోలేకపోతున్నారని అనిల్‌ కుమార్ కామెంట్ చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క సంవత్సరం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ నిండలేదన్నారు. ప్రజలకు చంద్రబాబు తాను కరవు నాయకుడని బాగా అర్ధమైనందునే  బాధపడుతున్నారని పేర్కొన్నారు.


చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్కటి కూడా నిజం చెప్పలేదన్నారు. కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు శ్రీశైలం నుంచి తరలిస్తున్న నీళ్లే  ప్రాణాధారంగా మారుతుండడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారని... ఈ ఏడాది పంటలు పండబోతున్నాయన్న సూచనలు కనబడే సరికే ఎంతో బాధగా ఉన్నట్లుందని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. వరదలు తాము సృష్టించామంటున్న చంద్రబాబు.. కరవు తానే సృష్టించానని ఒప్పుకుంటున్నట్లు ఉందన్నారు.


చంద్రబాబు తన ఇంటిని ముంచేశారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు అనిల్ కుమార్ యాదవ్. కృష్ణా డెల్టా రైతులకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు ఈ ఏడాది అందుతోందన్న ఆనందం  కాని... ఈ ఏడాది తాగునీటి కటకట చాలావరకు ఉండకపోవచ్చనే సంతోషం కాని... చంద్రబాబులో లేవంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉంటుందా ? అని ప్రశ్నించారు.


ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు మొత్తం నీటిని ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా దిగువకు వదిలేసి ఉంటే పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా ఉండేదన్నారు. నీట ముంపునకు గురైన పంటలు, నివాసాల విషయంలో నష్టం అంచనా జరిపి తగిన పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి అనిల్ గణాంకాలతో సహా వివరిస్తూ తప్పుపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: