ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 1,26,728 ఉద్యోగాలకు 21 లక్షల 69 వేల మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి 1 లోని అన్ని ఉద్యోగాలకు, కేటగిరీ 3 లోని డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి నిన్న సాయంత్రం 4 గంటల నుండి హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మెరిట్ ప్రాతిపదికన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయని స్పష్టం చేసారు. 
 
కష్టపడి చదువుతున్న అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని గిరిజా శంకర్ తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడితే వెంటనే కస్టడీలోకి తీసుకుంటామని గిరిజా శంకర్ తెలిపారు. బస్టాండ్ ఇంకా ముఖ్యమైన కూడళ్ళలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తు పట్టటానికి హెల్ప్ డెస్క్, రూట్ మ్యాప్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు గిరిజా శంకర్ సూచించారు. 
 
అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఒక నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రాలకు వచ్చినా అనుమతి నిరాకరిస్తామని గిరిజా శంకర్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, బాల్ పాయింట్ పెన్, ఐడీ ప్రూఫ్ తెచ్చుకోవాలని సూచనలిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల సమయంలో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరగటం గొప్ప విషయమని గిరిజాశంకర్ అభిప్రాయం వ్యక్తం చేసారు. 
 
సెప్టెంబర్ 1 వ తేదీ ఉదయం 12 లక్షల 50 వేల మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 3 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు గిరిజా శంకర్ తెలిపారు. మహిళా అభ్యర్థులకు తనిఖీ చేసేందుకు అంగన్ వాడీ కార్యకర్తలను నియమిస్తారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 4,478 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. పట్టణాలకు పరీక్షకు ముందు రోజు చేరుకునే పేద అభ్యర్థులకు దాతల సహకారంతో కలెక్టర్ వసతి సౌకర్యం ఏర్పాటు చేయాలని గిరిజా శంకర్ సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: