కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు.. కాశ్మీర్ విభజన, రాష్ట్ర హోదా తొలగింపు వంటి సంచలనాత్మక చర్యలతో పాక్ అండ చూసుకుని రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు ఊహించని షాక్ తగిలింది. దీంతో మోడీ సర్కారుపై గుర్రుగా ఉన్న టెర్రరిస్టులు అదను కోసం దెబ్బ తీసేందుకు కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.


తాజాగా ఉగ్రవాదులు దక్షిణ భారతాన్ని టార్గెట్ చేసి తమిళనాడులో ప్రవేశించినట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీలంక నుంచి తమిళనాడు తీరం ద్వారా ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో భారత నౌకా దళం అప్రమత్తమైంది. సముద్ర జలాలతో పాటు తీరం అంతటా హై అలర్ట్ ప్రకటించింది.


శుక్రవారం నుంచి తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోయంబత్తుర్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల సమాచారంతో పక్కనే ఉన్న కేరళ, ఏపీ, తెలంగాణ కూడా అలర్టయ్యాయి. పోలీసు అధికారులందరూ అత్యంత అప్రమత్తతో ఉండాలని ఆయా రాష్ట్రాల డీజీపీలు తమ సిబ్బందికి సందేశాలు పంపారు.


ఆర్టికల్  370రద్దు తర్వాత భారత్ లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారనే  నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఇండో-పాక్ సరిహద్దుల్లో తనిఖీలు పెంచారు. నిఘా తీవ్రం చేశారు. రెండు పాకిస్థాన్ పడవలను భారతీయ సరిహద్దు భద్రతాదళం గుర్తించింది. క్షుణ్నంగా తనిఖీ చేసిన భద్రతాదళాలు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని ప్రకటించాయి.


గుజరాత్ లోని కచ్ జిల్లా సమీపంలోని ఇండో-పాక్ సరిహద్దులో పెట్రోలింగ్   పార్టీపాకిస్థాన్‌   పడవలను గుర్తించినట్లు సరిహద్దు భద్రతా దళం అధికారులు తెలిపారు. మే నెలలో కూడా పాకిస్థాన్ కు చెందిన జాలర్ల పడవను బీఎస్ ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకూ అంతటా అప్రమత్తత నెలకొంది. ఉగ్రదాడులను కాచుకునేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: