ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌ పాల‌నాప‌గ్గాలు చేప‌ట్టి సుమారు వంద‌రోజులు అవుతోంది. త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నారు. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుని ఔరా.. అనిపించుకున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. ఇప్పుడు ఏపీలోరాజ‌కీయ‌వ‌ర్గాల్లోనేకాదు.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది. పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌ల‌విద్యుత్ కేంద్రం టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి, రీ టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌భుత్వం తీసుకున్న కాంట్రాక్టు ర‌ద్దు ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు స‌స్పెండ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


ఇది ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బేన‌ని చెప్పొచ్చు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్‌కు ఇది ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితేన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. అయితే.. ఇప్పుడు అస‌లు విష‌యం ఏమిటంటే.. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సుప్రీం కోర్టును ఆశ్ర‌యిస్తారా..?  లేదా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌దానిపై సంబంధిత అధికారుల‌తో జ‌గ‌న్ సుదీర్ఘ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నా.. ఎలా ముందుకు వెళ్లాల‌న్న విష‌యంలో ఇప్ప‌టికీ ఓ క్లారిటీ రాన‌ట్లు తెలుస్తోంది.


ఇక ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నాయి. దీనిని ఎలా ఎదుర్కోవాల‌న్న దానిపై జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతోంది అన్న‌ది పార్టీవ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని అనుకోలేదంటూ వైసీపీ శ్రేణులు గుస‌గులాడుకుంటున్నాయి. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. హైకోర్టు తీర్పుతోనే ఆగిపోతే.. తాను తీసుకున్న నిర్ణ‌యం త‌ప్పేన‌ని ఒప్పుకున్న‌ట్లు అవుతుంద‌ని, దీంతో ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గుతుందని జ‌గ‌న్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 


ఒక‌వేళ‌.. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్ర‌యిస్తే.. తీర్పు సానుకూలంగా వ‌స్తుంద‌న్న గ్యారంటీ లేదు. ఒక‌వేళ‌.. ప్ర‌తికూలంగా తీర్పు వ‌స్తే.. దెబ్బ‌మీద దెబ్బ‌ప‌డిన‌ట్లు అవుతుంది. ప్ర‌తిప‌క్షాలు మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ‌ను రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: