సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా , నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో అని చెప్పడానికి బీ.పీ. మండల్  (బిందేశ్వరి ప్రసాద్ మండల్ )జీవితమే నిదర్శనం.  మండల్ బీహార్ లోని బనారస్ లో ఒక యాదవ్ కుటుంబంలో ఆగష్ట్ 25, 1918 లో జన్మించారు. మాధేపురా జిల్లాలోని  మోరో  గ్రామంలో పెరిగిండు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని  మరియు దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని  పూర్తి చేసిండు . పాట్నా కాలేజీలో  ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు. ఆ  తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేశారు. దురదృష్టవశాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది. మండల్ తన 23 వ ఏటనే జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయ్యారు. 1945-51 మధ్య కాలములో మాధేపుర డివిజన్ లో జీతం తీసుకోకుండానే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గా పని చేశారు. మండల్  రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అధికార పక్షములో ఉండి బీహార్ లోని వ్యవసాయ కులానికి చెందిన కుర్మీలపై  అగ్రవర్ణ రాజుపుత్రులు దాడి చేయడాన్ని నిరశించారు. ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ ది ఈ సామాజిక వర్గమే(బీసీ –కాపు).  తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్దమై నియోజకవర్గంలో భాగమైన గ్రామమైన పామాలో  మైనారిటీలు మరియు దళితులపై  పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై  తన గళం వినిపించేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు చెందిన  సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ఎస్పి)లో చేశారు. దాంతో ఆ పార్టీ  రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా నియమితులయ్యారు.




1967 ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962 లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి 1967 లో  69 సీట్లు వచ్చినయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్- ఎస్.ఎస్.పీ. మంత్రిత్వశాఖ ఏర్పడింది. ఆయన పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ మంత్రివర్గంలో కేబినెట్లో చేర్చారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు . కానీ పార్టీలో , ప్రభుత్వంలో కొన్ని విబేధాలు రావడముతో  కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇవ్వడముతో ఫిబ్రవరి 1, 1968 న బీ.పీ. మండల్ బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పని చేశారు. మార్చి 5 , 1967 న సోషిత్ దళ్ ( అణగారిన ప్రజల పార్టీ ) ని స్థాపించారు. 1972 లో తిరిగి శాసన సభకి ఎన్నికయ్యారు. 1972 లో అప్పటి బీహార్ బ్రాహ్మణ  ముఖ్య మంత్రి పాండే మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో  కింది ఉద్యోగి  నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలన్నారు. ఆ తర్వాత 1974 లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించారు. మండల్  తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా పని చేశారు. జనవరి 1 ,1979 న జనతా ప్రభుత్వం కాలములో ఏర్పాటు చేసిన రెండవ వెనకబడిన తరగతుల కమీషన్ ఛైర్మన్ గా బీ.పీ. మండల్ భాధ్యతలు చేపట్టారు. ఈ కమీషనులో బీ.పీ. మండల్ చైర్మన్ గా ఆర్.ఆర్. భోలే , దేవాన్ మోహాన్ లాల్ , దీన బంధు సాహు , కే.సుబ్రహ్మణ్యంలు సభ్యులుగా మరియు ఎస్.ఎస్. గిల్ సెక్రెటరీ గా కమీషన్  ఏర్పడింది. నవంబర్ 5, 1979 న దీన బంధు సాహు ఆరోగ్యం సహకరించకపోవడముతో ఆయన స్థానములో ఎల్.ఆర్ . నాయక్ (దళితుడు ) సభ్యుడుగా చేరారు. ఈ కమీషనుకి తన రిపోర్ట్ నివేదించడానికి కేవలం 11 నెలల సమయాన్ని కేటాయించారు.  డిసెంబర్ 31 , 1979 నాటికి తన నివేదికని అందజేయాలి. మార్చి 21,1979 రోజు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి డిల్లీలో కమీషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. బీ పీ మండల్ తన బృందముతో పని ప్రారంభించాలంటే అనేకమైన ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వచ్చింది. సెక్రెటరీ , పరిపాలనాధికారి , కొద్ది మంది స్టెనోస్ తోనే 1979 జూన్ , జులై నాటికి పని ప్రారంభమైంది. మిగతా సిబ్బంది రిక్రూట్మెంట్ కి మరో నాలుగు నెలలు పట్టింది. కమీషన్ తన పనిలో పూర్తీ స్థాయిలో నిమగ్నం కాగానే ఆగష్ట్ 1979 లో మొరార్జీ దేశాయి ప్రభుత్వం పడిపోయింది. దేశమంతా తిరుగుతున్న కమీషనుకి ఆ కాలములోనే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలు రద్దై తిరిగి ఎన్నికల్లో ఆ రాష్ట్రాలు బిజీ అయిపోయ్యాయి. బీ పీ మండల్ అభ్యర్ధన మేరకు రిపోర్ట్ అందించే గడువు మరో ఏడాది పెంచారు. దేశమంతా తిరుగుతూ అన్ని రాష్ట్రాలు  , కేంద్రపాలిత ప్రాంతాలకి   ప్రశ్నావళిని ఇచ్చారు. సమయాభావం,  అననుకూల పరిస్థితుల దృష్ట్యా ఈశాన్య రాష్ట్రాలకి కమీషన్ వెళ్ళలేకపోయింది.  కమీషన్ అనేక శ్రమకోర్చి ఐఐఎమ్ బెంగళూరు, సెన్సస్ రిజిస్ట్రార్ డిల్లి ,  జేఎన్యూ ఇతర యూనివర్సిటీలు, టాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ , ముంబాయిల నుండి సమాచారం సేకరించింది. కమీషన్ రిపోర్ట్ డ్రాఫ్టింగ్ లో సెక్రెటరీ ఎస్.ఎస్. గిల్ చాల శ్రమ తీసుకున్నారు. 




రెండవ జాతీయ ఓబీసీ కమీషన్ నివేదిక రూపకల్పనలో బీపీ మండల్  ఎంతో శ్రమించారు. ఆ రిపోర్ట్ నివేదించే సమయానికి మండల్ ఆరోగ్యం క్షీణించింది.  బలహీన వర్గాల పట్ల తనకున్న ఉన్న నిబద్ధతనే కార్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేసేలా చేశాయి.  చివరికి డిసెంబర్ 31 , 1980 న బీపీ మండల్ కమీషన్ ఓబీసీల కోసం చేయవలిసిన 40 సిఫార్సులు సూచిస్తూ అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారికి (ప్రభుత్వానికి )తన నివేదికని  సమర్పించింది. కానీ అప్పటికే  జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడంతో మండల్ సిఫార్సుల అమలు మూలకి పడింది. దేశవ్యాప్తంగా బీసీలంతా కలిసి ముఖ్యంగా మండల్ కమీషన్ నివేదికని అమలు పరచాలనే  డిమాండ్ తో 1981 సెప్టెంబర్ 11న “ నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ “ అనే సంస్థని స్థాపించుకున్నారు. దీని వ్యవస్థాపకులు బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ (మంగలి )  మండల్ కమీషన్ నివేదికని అమలుపర్చమని పెరియార్ ద్రావిడ కజగం ఉద్యమ వారసుడు వీరమణి వందకి పైగా సమావేశాలు నిర్వహించారు.  1990 ఆగష్ట్ 7 న తొలి భారత బ్రాహ్మణేతర  ప్రధాని వీ.పీ.సింగ్  తమ జనతాదళ్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం   కాన్షీరామ్  డిల్లీ లోని బోట్స్ క్లబ్ వద్ద  40 రోజుల పాటు ' మండల్ అమలు కరో యా కుర్సీ ఖాళీ కరో '  ( మండల్ సిఫార్సులని అమలు చేయండి లేదా గద్దె దిగిపోండి ) అంటూ చేసిన ఆందోళన వల్ల పార్లమెంట్ లో మండల్ కమీషన్ సూచించిన 40 సిఫార్సులల్లో కనీసం ఒక్కటైన బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలల్లో 27% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆగష్ట్ 7, 1990 న ప్రకటించడంతో అప్పటి  వీపీ సింగ్ ప్రభుత్వం  పడిపోయింది. కేవలం 61 ఏళ్ల వయస్సులో  క్రియాశీలక రాజకీయాలను విడిచిపెట్టిన మండల్ తన నివేదిక నుండి వ్యక్తిగతంగా ఎటువంటి రాజకీయ ఫలితాలని ఆశించలేదు. మండల్ ఏప్రిల్ 13, 1982 న పాట్నాలో మరణించిండు. బీసీలు విద్యా ఉద్యోగ చట్ట సభల్లో ఆర్థిక రంగంలో  తమ న్యాయమైన వాటా పొందేలా మరియు మిగతా 39 సిఫార్సులు అమలు అయ్యేలా ఉద్యమించి సాధించినప్పుడే  బీ.పీ. మండల్ కి మనమిచ్చే సరైన నివాళి. మండల్ కమీషన్ సిఫార్సులని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఏడు  ఆగష్ట్ 7ని ‘మండల్ డే‘ గా జరుపుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: