పాపం బీజేపీ.. కేంద్రంలో తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించినా.. ఏపీలో మాత్రం ఉనికిపాట్లు ప‌డుతోంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్పుడు కూడా తెలుగు త‌మ్ముళ్ల పెత్త‌న‌మే న‌డిచింది. బాబు పెత్త‌నంలోనే క‌మ‌ల‌ద‌ళం న‌లిగిపోయింది. 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక బీజేపీ జాడేలేకుండా పోయింది. 


అయితే.. అంత‌ర్గ‌తంగా ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. కీల‌క త‌మ్ముళ్ల‌కు బాబుగారు ఏం నూరిపోశారోగానీ.. ఏకంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలోకి జంప్ అయ్యారు. నిజానికి వీరంద‌రూ బాబుగారికి అత్యంత స‌న్నిహితులు. వీరంద‌రూ ఒక్క‌సారే బీజేపీలోకి వెళ్ల‌డంతో అనేక అనుమానాలు క‌లిగాయి.. ఇంకా క‌లుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడిప్పుడే అందులోని ఆంత‌ర్యం ఏమిటో తెలిసివ‌స్తోంది.


గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామ్యం అయిన‌ప్పుడు క‌మ‌లం నేత‌ల మాట న‌డ‌వ‌లేదు. మొత్తం పెత్త‌న‌మంతా తెలుగు త‌మ్ముళ్ల‌దే. క‌నీసం.. బీజేపీ నేత‌లు సొంతంగా ప్ర‌జ‌ల్లో త‌మ‌కంటూ ఇమేజ్‌నుక్రియేట్ చేసుకోలేక‌పోయారు.. కాదు.. కాదు.. బాబుగారు చేసుకోనివ్వ‌లేదు. తీరా.. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అప్ప‌టికే బీజేపీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. దీంతో 2109 ఎన్నిక‌ల్లో క‌నీసం ఉనికికి చాటుకోలేక‌పోయింది క‌మ‌ల‌ద‌ళం. అయితే.. ఇదేస‌మ‌యంలో కేంద్రంలో మాత్రం అజేయ‌శ‌క్తిగా ఎదిగింది. 2023 ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా.. ఏపీలో పాగా వేస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. తామంటే ఏమిటో చూపిస్తామంటూ చిందులు వేస్తున్నారు. 


అయితే.. ఇక్క‌డే వారికి స‌రికొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వ‌చ్చిన నేత‌ల‌తో త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లే మ‌ళ్లీ పెత్త‌నం చేయ‌డం మొద‌లు పెట్ట‌డంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ బీజేపీపై టీడీపీ నుంచి వ‌చ్చిన నేత‌ల‌తో పెత్త‌నం పెరిగిపోయింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ఏపీ బీజేపీకి టీడీపీ క‌బ్జా చేసిందంటూ ప‌లువురు నాయ‌కులు సెటైర్లు వేస్తున్నారు. 


ఇక ఏం చేయాలో పాలుపోని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. త‌న ఉనికిని చాటుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ‌చ్చీరాని విమ‌ర్శ‌లు చేస్తూ.. అభాసుపాల‌వుతున్నారు. గ‌త టీడీపీ తీసుకున్న త‌ప్పుడు నిర్ణ‌యాల‌ను కూడా జ‌గ‌న్  ప్ర‌భుత్వానికి ఆపాదిస్తూ.. చిందులు వేస్తున్నారు. ఇదంతా కూడా పార్టీ అధిష్ఠానం వ‌ద్ద త‌న ఉనికిని చాటుకునేందుకు క‌న్నా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌ల‌స‌ టీడీపీ నేత‌ల పెత్త‌నం పెరిగిపోయిన నేప‌థ్యంలో ఏపీలో ఇక పార్టీని ఎలా బ‌లోపేతం చేసుకుంటామంటూ క‌మ‌లం పార్టీ శ్రేణులు బ‌హిరంగంగానే చ‌ర్చించుకుంటున్నాయి. 


అన్ని అవ‌స‌రాలు తీరాక ఆ వ‌ల‌స నేత‌లు తిరిగి పోవ‌డం ఖాయ‌మ‌ని ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తొంద‌ర‌లోనే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు వ‌ల‌స టీడీపీ నేత‌లు చెక్‌పెట్టి.. వారికి అనుకూల‌మైన నేత‌ను పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించుకుటార‌నే టాక్ వినిపిస్తోంది. ఇది బాబు గేమ్ ప్లాన్ అన్న విమ‌ర్శ‌లు కూడా బీజేపీలోనే కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి టీడీపీ క‌బ్జా నుంచి ఏపీ క‌మ‌ల‌ద‌ళం ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: