కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శ‌నివారం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్ధం అరుణ్‌జైట్లీ పార్థివదేహాన్ని  కైలాష్‌నగర్‌లోని నివాసం నుంచి  బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా జైట్లీ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 


1952 డిసెంబర్ 28న ఢిల్లీలో అరుణ్ జైట్లీ  జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అరుణ్ జైట్లీ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విద్యార్థి దశలోనే ఆయన యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. ఏబీవీపీలో చేరారు. క్యాంపస్ లో ఏబీవీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అనంత‌రం ఢిల్లీ ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కొంతకాలానికే.. ఢిల్లీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలా ఢిల్లీ బీజేపీలో అరుణ్ జైట్లీ క్రియాశీలకంగా వ్యవహరించారు. విద్యార్థి నాయకుడిగా, పార్టీ నేతగా, కేంద్రమంత్రిగా.. అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి.బీజేపీలో ఆయన వేసిన ముద్ర ఎన్నటికీ చెరగనిదిగా ఉంటుంది. కిడ్నీ సంబంధిత శ‌స్త్రచికిత్స‌ తర్వాత జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో  ఆగస్టు 9న ఎయిమ్స్ లో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే జైట్లీ మృతి చెందారు. ఆయనకు చికిత్స జరుగుతున్న టైంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. 


2014లో బీజేపీ అఖండ మెజారిటీతో గెలువగా ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో.. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రక్షణ, వాణిజ్య, పరిశ్రమలు, న్యాయశాఖ మంత్రిగానూ జైట్లీ పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆరోగ్య కారణాల వల్ల అరుణ్ జైట్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత మోడీ కేబినెట్‌లోనూ చేరలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: