మాలలకు దన్నుగా నిలుస్తూ మాదిగలను విస్మరిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఇటీవల కొంతమంది చేస్తోన్న విమర్శలకు రాష్ట్ర ప్రభుత్వం మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పింది . మాల, మాదిగ , రెల్లి  కులాల వారికి వేర్వేరుగా మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మాల సంక్షేమ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ మాదిగ సంక్షేమ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రెల్లి మరియు ఇతరుల సంక్షేమ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఎన్నికలకు ముందు పలువురు షెడ్యూల్డ్‌ కులాల వారు చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులాల వారీగా ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెల్సిందే . ఈ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ,  ఎస్సీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీకి మూడు కార్పొరేషన్‌లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా  బీసీల్లో 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు .  అయితే ముందుగా షెడ్యూల్ కులాల వారికి వేర్వేరుగా కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఎన్నికల ముందు తానిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు జగన్ చెప్పకనే చెప్పారు .


 ఈ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఎవరి నిధులు వారే వాడుకునే వెసులుబాటు కల్పించినట్లయింది . ఇకపోతే ఇటీవల ఏపీ లో మరోసారి  ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మళ్ళీ పట్టాలెక్కించి ప్రయత్నాన్ని ఎమ్మార్పీస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు . మాలలకు రాష్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చి తమను విస్మరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు . తాజాగా మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా మాదిగల్లో ఉన్న అసంతృప్తిని దూరం చేయవచ్చునని వైకాపా నాయకత్వం భావిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: