క్రికెట్ లో సమూల మార్పులపై ఐసీసీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కాంకుషన్ సబ్ స్టిట్యూట్ కీలక సవరణకు ఆమోద ముద్ర వేసింది. ఒక ఆటగాడు గాయపడి ఆడలేని స్థితిలో రిటైర్డ్ హర్ట్ అయితే వచ్చే సబ్ స్టిట్యూట్ కి బ్యాటింగ్ , బౌలింగ్ కూడా అవకాశాన్ని కల్పించారు. తలకు బాగా బలమైన దెబ్బ తగిలినప్పుడు ఈ కాంకుషన్ స్థితి వస్తుంది. తాత్కాలికంగా స్పృహ కోల్పోవటం, తలతిరిగినట్లు ఉండటం, కాసేపు దృష్టి మందగించటం ఉన్నప్పుడు దీన్ని అమలు చేస్తారు. ఫీల్డర్ లకు బంతి తగిలినప్పుడు కూడా ఈ కాంకుషన్ సబ్ స్టిట్యూట్ వర్తిస్తుంది. గతంలో సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేసేవాడు. మొన్నటి ప్రపంచకప్ వరకూ ఇదే నిబంధన కొనసాగింది.


ఇప్పుడు ఐసీసీ ఈ నిబంధనకు సవరణ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని రకాల ఫార్మాట్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కాంకుషన్ సబ్ స్టిట్యూట్ కు అధికారికంగా ఆమోదం లభించింది. అయితే ఏ ఆటగాడిని పంపించాలో జట్టు వైద్య ప్రతినిధి నిర్ణయం తీసుకుంటారని ఐసిసి పేర్కొంది. మ్యాచ్ రిఫరీ దీనికి ఆమోదం తెలుపవలసి ఉంటుందని చెప్పింది. తాజాగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నుంచి కాంకుషన్ సబ్ స్టిట్యూట్ అమలులోకి వచ్చింది. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి కాంకుషన్ సబ్ స్టిట్యూట్ గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్నస్ ల్యాబస్ చేంజ్ చరిత్ర సృష్టించాడు.


సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్ ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మెడను బలంగా తాకడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. తర్వాత మళ్లీ బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ తొంభై రెండు పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్టీవ్ స్మిత్ రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. సబ్ స్టిట్యూట్ కావాలని రిఫరీని క్రికెట్ ఆస్ట్రేలియా సంప్రదించింది. స్మిత్ స్థానంలో కాంకుషన్ సబ్ స్టిట్యూట్ గా ఆల్ రౌండర్ మార్నస్ ల్యాబస్ చేంజ్ మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి కాంకుషన్ సబ్ స్టిట్యూట్ గా లాబస్ చేంజ్ అరుదైన ఘనత సాధించాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: