అప్పు! -సాధార‌ణ మ‌నుషుల‌కు మాత్ర‌మే కాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వాలకు కూడా అవ‌స‌ర‌మే! ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు అధికార ప‌గ్గాలు పుచ్చుకున్న వారు అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. వివిధ ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాల నుంచి ఉద్యోగుల జీత‌భ‌త్యాల వ‌ర‌కు.. ప్ర‌జాప్ర‌తినిధులకు ఇచ్చే గౌర‌వ వేత‌నాల నుంచి వివిధ ప‌నులకు చేసే ఖ‌ర్చుల వ‌ర‌కు కూడా అనేక రూపాల్లో నిధులు అవ‌స‌రం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి గ‌తంలో అనేక రూపాల్లో గ్రాంటులు రాష్ట్రాల‌కు అందేవి. దీంతో ఏదో ఒక రూపంలో రాష్ట్రాల‌కు ఈ నిధులు వినియోగించుకునేందుకు అవ‌కాశం ఉండేది. ఇది సుమారు రెండు ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కు కూడా బాగానే సాగింది. 


అయితే, రాను రాను.. కేంద్రం ప్ర‌భుత్వం ఆర్థిక సంఘాల సూచ‌న‌ల‌తో గ్రాంటును త‌గ్గించ‌డం ప్రారంభించింది. అదేస‌మ‌యంలో రాష్ట్రాలు అప్పులు చేసేందుకు అవ‌కాశాలను విస్తృతం చేసింది. అంటే,.. తాను ఇవ్వ‌డం మానేసి రాష్ట్రాల‌ను అప్పుల దిశ‌గా న‌డిపించిన ఘ‌న‌త కేంద్రానిదే. అయితే, ఈ విష‌యంలో కొంత తెలివిడితో వ్య‌వ‌హ‌రించిన ఒడిసా.. కేర‌ళ వంటి కీలక‌మైన రాష్ట్రాలు మితిమీరిన అప్పుల జోలికిపోకుండా.. చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ప‌రిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఏపీ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు గ‌త ఐదేళ్ల‌లో మెర‌మెచ్చుమాట‌ల‌తో ప్ర‌చార పాల‌న సాగించిన నేప‌థ్యంలో రాష్ట్రం వ‌డివ‌డిగా అప్పుల దిశ‌గా ప‌రుగులు తీసింది. 


ఇక‌, ఇప్పుడు ఈ ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారింద‌నేది రిజ‌ర్వ్ బ్యాంక్ చెబుతున్న‌మాట‌. ఈ నేప‌థ్యంలోనే 
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల అప్పుల వివరాలు స్పష్టంగా తమకు తెలపాలని ఆర్థిక శాఖకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) వరుస లేఖలు రాసింది. బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించే రుణాల వివరాలతో పాటు ప్రభుత్వ గ్యారంటీలతో ఆయా కార్పొరేషన్ల నుంచి తీసుకునే ‘ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌’ వివరాలు, ఇంకా ఇతర అప్పుల సమాచారం ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా తెలియజేయాలి. కానీ, గత ఏడాది నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ కేవలం బహిరంగ మార్కెట్‌ రుణాల వివరాలను మాత్రమే ఆర్‌బీఐకి తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ వర్గాలు రాష్ట్రానికి లేఖలు రాస్తున్నాయి. 


ఇక‌, గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ‌డిచిన ఐదేళ్ల‌కాలంలో భారీ ఎత్తున అప్పులు చేసింద‌నేది ప్ర‌స్తుత అధికార పార్టీ ఆరోప‌ణ‌. దీనికి బాబు, ఆయన ప‌రివారం ఎప్పుడూ అడ్డు చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 వేల కోట్ల‌కుపైగా గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు చెల్లిస్తోంది. ఇక‌, ఇప్పుడున్న ప్ర‌భుత్వం ఎక్కువ‌గా ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరిట న‌గ‌దు పందేరానికే పెద్ద‌పీట వేసింది. ఈ క్ర‌మంలో అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, రైతు భ‌రోసా.. వాహ‌న మిత్ర ఇలా అనేకానేక ప‌థ‌కాల మాటున ఉన్న‌దంతా నిధుల పందేర‌మే! దీంతో రాష్ట్రం అప్పులు చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి అయింది. 


మార్కెట్ రుణాల నుంచి క‌న్‌సాలిడేటెడ్ డెట్స్ వ‌ర‌కు ప్ర‌భుత్వం చేతికి అందినంత అప్పులు చేస్తోంద‌నేది ఆర్‌బీఐ ఆరోప‌ణ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో(ఈ ఏడాది ఏప్రిల్ 1-జూలై 10)  రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.3,672 కోట్ల‌ను మార్కెట్ రుణంగా పొంద‌డం గ‌మ‌నార్హం! మొత్తానికి గ‌తంలో చంద్ర‌బాబు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని నాకించేశారంటే.. ఇప్పుడు జ‌గ‌న్ జుర్రేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: