రాజకీయమంటే ప్రజలకు  మేలు చేయడం కోసం, ప్రజాసేవ చేయడం కోసం ఉన్న చక్కని వ్యవస్థ. రాను రాను అధికారమే పరమావధిగా పదవులే పరమాన్నంగా మారిన వ్యవస్థలో అబద్దాలు, అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ లబ్ది పొందుతున్న పార్టీలను, నాయకులను  చూస్తున్నాం. ప్రతీదీ రాజకీయమే. కాదేదీ కవితకు అనర్హం అన్న తీరున రాజకీయాలు తయారయ్యాయి.


ఏపీలో చూస్తే డ్రోన్ రాజకీయం రంజుగా సాగుతోంది. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎందుకు ఎగిరిందన్నది ఇపుడు అతి ముఖ్య ప్రజా సమస్య అయిపోయింది. చంద్రబాబుని చంపేస్తున్నారంటూ ఆ పార్టీ నాయకుడు బుద్దా వెంకన్న అపుడే రాగాలు అందుకున్నారు. బాబుకు ఏమైనా జరిగితే అంటూ టీడీపీ నాయకులు వార్నింగులకు కూడా దిగిపోతున్నారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన బాబు ఇంటి మీద డ్రోన్ ఎందుకు ఎగరేశారు, దీని మీద విచారణ చేయాల్సిందేనంటూ ఈ రోజు గవర్నర్ కి కూడా వినతిపత్రం సమర్పించారు.


ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు అన్న అంశం మీద టీడీపీ రచ్చ చేయదలచుకుందని క్లారిటీగా తెలిసిపోతోంది. ఇక చినబాబు లోకేష్ ని కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు చంపేస్తారని మరో ప్రచారాన్ని తమ్ముళ్ళు లేవదీస్తున్నారు. ఇంకో వైపు ఆర్కే కూడా తనకు రక్షణ కావాలంటూ పోలీసులను కలసి వచ్చారు. లోకేష్ ప్రేరేపిత  ముఠా సోషల్ మీడియాలో తనని బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే అభియోగం.


మరో వైపు బుద్దా వెంకన్న అయితే ముఖ్యమంత్రి జగన్ ఇంటికి వెళ్ళి మరీ ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నారు. వీటిని చూసినపుడు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అన్న ఆలోచన వస్తుంది. ఇవన్నీ చూస్తూంటే ఈ చంపుడు మాటలేంటి, ఈ ప్రాణ త్యాగాలేంటి, ఈ రచ్చ ఎందుకు అనిపిస్తోంది. అంతే కాదు. ఈ హత్యలు,  కక్షలు, కార్పణ్యాలు ఏంటి అన్న మాటలు కూడా వినిపిస్తాయి. ఇదంతా పొలిటికల్ గేం లో భాగమని ఎంతలా అనుకున్నా ఈ డేంజరస్ స్టేట్మెంట్స్  వల్లనే దిగువ స్థాయి కార్యకర్తలు బలైపోతున్నారన్న సంగతి బాధ్యత కలిగిన నాయకులు గుర్తుంచుకుంటే మంచిది. ప్రజా సమస్యలపై ఎవరైనా ద్రుష్టి సారిస్తే ఇంకా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: